పుట:Aandhrakavula-charitramu.pdf/632

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

605

బ మ్మె ర పో త రా జు

తెలుఁగు పురాణములలో భాగవతము మిక్కిలి జనసమ్మతమైప పుస్తకము. అందలి రుక్మిణీకల్యాణము, గజేంద్రమోక్షము మొదలైన కధలను సమస్త జనులును జదువుదురు. ఈ కవి భాగవతము రచించిన తరువాత వీరభద్ర విజయమను మఱియొక గ్రంథమును రచించెను. భాగవత చతుర్థస్కంధము నందలి దక్షయజ్ఞకధలో “అనయంబు లుప్త క్రియాకలాపుఁడు మానహీనుఁడు మర్యాదలేనివాఁడు మత్తప్రచారుఁడున్మ త్త ప్రియుఁడు' అనియు, “వసుధ నెవ్వారు ధూర్జటి వ్రతులువారు వారికనుకూలు రగుదు రెవ్వారు వార లట్టి సచ్చాస్త్రపరిపంధులైనవారు నవనిఁ బాషండులయ్యెద" రనియు శివదూషణము విశేషముగాఁ జేయఁబడి యుండుటచే దత్పాపపరిహారార్థమయి వీరభద్రవిజయమును జేసినట్లా పుస్తకములోని యీ క్రింది పద్య మునందుఁ జెప్పఁబడి యున్నది.

  ఉ. “భాగవతప్రబంధ మతిభాసురత న్రచియించి దక్షకృ
      ద్యాగకథాప్రసంగమున నల్పవచస్కుఁడనైతిఁ దన్నిమి
      త్తాగమవక్త్రదోషపరిహారత కై యజనైకశైవశా
     స్త్రాగమవీరభద్రవిజయంబు రచించెద వేడ్కతోడుతన్.”

['భాగవత ప్రబంధ' మను నీ పద్యము కొన్ని తాళ ప్రతులలో మాత్రమే కలదు; విలేఖకు లెవరో యీ పద్యమును రచించి యందుఁ జేర్చియుందురు కావున నీ పద్యమును విడిచివేసి, పోతనామాత్యుండే వీరభద్రవిజయకర్తయనియు, భాగవతమునకు ముందు దీనిని రచించెననియు నిశ్చయింపవలసి యున్నది' (ఆంధ్రకవి తరంగిణి ఆఱవ సంపుటము. పుటలు 192 193 ) ]

వీరభద్రవిజయముంగూర్చి యందే యిట్లు చెప్పబడియున్నది.

“ఇప్పుడు ముద్రితమైయున్న వీరభద్ర విజయమందలి నాల్గవ యాశ్వాసము పోతనామాత్య విరచితము కాదనియు, నెవరో రచించిన భాగము నిందెవ్వరో చేర్చిరనియు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు భారతి పత్రికలో (పుష్పాంజలి - రక్తాక్షి - ఆషాఢము) నీ క్రింది విధముగా వ్రాసి యున్నారు