Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

604

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

షష్ఠ స్కంథము సింగయకవిచేఁ చెప్పఁబడినట్టు స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది. ద్వితీయతృతీయచతుర్ధస్కంథములు పోతనార్యవిరచితము లయినట్లే కనఁబడుచున్నవి. అయినను మన మే భాగము పోతనకవి విరచితమో యే భాగము తచ్చిష్యవిరచితమో యేయే పద్యములు శిష్యజన పూరితములో యేవి యెవరి దోషములో దృఢముగా నిర్ధారణము చేయఁజాలము. పూర్వలాక్షణికు లందఱు నంగీకరింపని పోతనకవిత్వమునందుఁ బొత్తిగా దోషములే లేవని సాధింపఁ జూచుటకంటె భాగవతమునకు తరువాత రచించిన[1] వీరభద్రవిజయమునందుఁ గూడఁ గొన్ని దోషములు కనుపట్టుచుండుటచేత పోతనకృతభాగవతమునందును గొన్ని దోషములున్నవని యొప్పుకొనుటయే న్యాయము. షోడశ కళాపరిపూర్ణ మయిన చంద్రబింబమునందుఁ గొంచెము కళంకమున్నట్టుగా సర్వజనసమాదరణీయమయిన యీతని కవితాసుధా సముద్రమునందుఁ గొన్ని నెఱసు లున్న ను, దాని కొక కొఱత గలుగఁ బోదు.

పోతనకవిత్వము భక్తిరస ప్రధాన ప్రధానమయినది; పదలాలిత్యము గలదయి యమకాది శబ్దాలంకార భూయిష్టమయి శ్రావ్యముగా నుండును. ఇతఁడు భారతమును రచించిన కవులవలెఁ గాక తన భాగవతమును మూల గ్రంధమునకంటెఁ బెంచి వ్రాసెను. మూలమైన సంస్కృతభాగవత గ్రంథసంఖ్య యిరువది వేలుగా నున్నను, ఇతఁడు రచించిన తెలుఁగుభాగవతము ముప్పదివేల గ్రంథము కలదిగా నున్నది.

భగవద్గుణవర్ణనాదులు వచ్చినప్పుడు తన భక్తి తేటపడునట్లుగా స్వకపోలకల్పితవర్ణనలు గూర్చియు, భాగవతములో లేని విష్ణువురాణాదులలోని కథలను చేర్చియు, కొన్ని స్థలములలో గ్రంధమును బెంచినసు తక్కిన భాగమంతయు విషయభేదము లేక వ్యాసవిరచిత మూలగ్రంధమునకు టీకవలె నుండును, భాగవతములో లేని సత్యభామయుద్ధాదులు విష్ణుపురాణమునుండి గ్రహింపఁబడినవి.

  1. [భాగవత రచనకు ముందే వీరభద్రవిజయము రచింపఁబడి యుండునని విమర్శకుల యాశయము.]