పుట:Aandhrakavula-charitramu.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

597

బ మ్మె ర పో త రా జు

యిది మఱియొకటి కాదు ఒక పదమునందలి యొక అక్షరము రేఫమును, శకటరేఫము నగు ననుటవలఁన....... కూడదను వాదమునకే దౌర్బల్యము కలిగించునని నా యభిప్రాయము. ఒక పదమునందలి రేఫము ఱకారముగా మాఱునప్పుడు ప్రత్యేకముగా రేఫఱకారములకు మైత్రి కలిగియున్న నేమి బాధ కలుగునో నే నూహింపఁజాలకున్నాను. తెలుగుపదములం దివిఱాలని నిర్ధారణ చేయుటకు వారి కేమి యాధారములున్నవో మొట్టమొదట నాకు దెలియకున్నవి. కవిత్రయమువారి ప్రయోగములందు సంస్కృతపదములతో యతిప్రాసములయందుఁ జేరనివాని నన్నిఁటిని శకటరేఫములనుగా నిర్ణయించి యున్నారు. రేఫములను గలిగియుండియుఁ దెలుఁగుపదములు యతి ప్రాసములయందు భారతాదులలో సంస్కృతపదముతోఁ జేరక యుండరాదా? "నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్" అని వాగను శాసనుఁడు చెప్పియుండుటచే లఘ్వలఘురేఫములకు మైత్రి కూడ దందురేమో ! ఆంధ్రశబ్దచింతామణి నన్నయభట్టు చెప్పినదయి యుండదని యాతని చరిత్రమునందు నిదర్శనపూర్వకముగాఁ జూపఁబడి యున్నది. కాఁబట్టి రేఫఱకారవైరము నన్నయభట్టుమతము కాదని సందేహింప వలసి యున్నది. ఈ భేదమావశ్యక మని చెప్పిన బాలసరస్వతి సహిత మీ భేదమును గనిపెట్టలేక తన చంద్రికాపరిణయమునందు రేఫఱకారములకుఁ బ్రాసమైత్రి చేసియున్నాఁడు. రేఫఱకారమైత్రి కూడదని పూర్వకాలము నందుఁ గొందఱిమతమైనను , కూడుననియు పలువురమతమై యున్నది. భారతాదుల నామూలాగ్రముగాఁ బరిశోధించి యుభయభాషలయందును సర్వతోముఖపాండిత్యము గలవారైన బమ్మెర పోతన, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు, పింగళి సూరన, అల్లసాని పెద్దన, మొదలయిన తొంటికవులనేకులు రేఫఱకారమైత్రి నంగీకరించినపక్షమువారు

      క. న ణ లను రెండక్షరముల
         కును వడిఁ బ్రాసంబుఁ బెట్టుకొనవచ్చుఁ గృతిన్,
         విను ర ఱ ల కట్ల పెట్టం
         జను ల ళ ల కభేద మరయ సర్వజ్ఞనిధీ !