Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

593

బమ్మెర పోతరాజు

గల్పించినారు. వానిలోఁ గొన్నిటిని నిందుఁ జెప్పుచున్నాను. పోతనామాత్యుని బావయైన శ్రీనాధుఁడు భాగవతము తనయేలికయైన కర్ణాట ప్రభున కంకితము చేయింపవలెనని పల్ల కిమీఁద నోరుగంటికి వచ్చి. ఊరిబయలి పొలములో పోతన యరక కట్టించి కుమారునిచేత దున్నించుచుండఁగాఁ దన మహత్త్వమును వారికి జూపనెెంచి పల్లకి మోచుచున్న బోయీల నొక ప్రక్కబొంగు వదలివేయుఁ డని యాజ్ఞాపించెనట ! మోచువారు లేకయే పల్లకి నడుచుచుండుట చూచి పోతన పుత్రుఁడయిన మల్లన తండ్రితోఁ జెప్పఁగా నతఁడు నాగలికాాడికిఁ గట్టిక యొక దున్నపోతును విప్పుమని యాజ్ఞాపించెనఁట ! ఒకప్రక్క దున్నపోతు లేకయే యరక సాగుచుండుట చూచి శ్రీనాధుఁడు రెండవదండిని కూడ విడువుఁడని బోయీల కాజ్ఞాపించి పల్లకిని నడిపింపుచుండఁగా పోతన రెండవ ప్రక్కనున్న దున్నపోతునుకూడ విప్పించి నాగలి సాగునట్లు చేసెనఁట ! అటుపిమ్మట శ్రీనాథుఁడు పోతనను సమీపించి ' హాలికులు సుఖముగా నున్నారా? యని పరిహాసపూర్వకముగా కుశల ప్రశ్నము చేయఁగా నతఁడు

   ఉ. బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్
       గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
       హాలికులైన నేమి ? గహనాంతరసీమలఁ గందమూల కౌ
       ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై ?

అని ప్రత్యుత్తరము చెప్పెనఁట ! అందుకు శ్రీ నాధుఁడు మనసులో లజ్జ పడియు పైకి తోఁపనీయక ముఖమున లేని వికాసము తెచ్చుకొని బావ మఱఁదుల మేలమున కాడిన మాటకుఁ గోపగింపఁ జెల్లునా ? యని సమాధానపఱిచెనఁట : తరువాత మల్లన ముందుగా నింటికిఁ బోయి భోజన పదార్దముల నిమిత్తమై ప్రయత్నము చేసి లభ్యములు కాక విచారముతో నూరి వెంటఁ దిరుగుచుండఁగా విష్ణుమూర్తి పోతనరూపమున వచ్చి పంచభక్ష్య పరమాన్నములతో విందు చేయుటకు తగిన సమస్త పదార్ధముల నిచ్చి