Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

592

బమ్మెర పోతరాజు

విప్పి చదివి భ్రష్టములైన భాగములను పూరించెనని చెప్పఁబడి యున్నది. ప్రౌఢకవి మల్లనయే పోతనామాత్యునిపుత్రుఁ డయిన పక్షమున మహాకవి యైన యతఁడు తండ్రి రచియించిన పుస్తకమును విప్పియైనఁ జూడకుండె ననుట యంత విశ్వాసార్హముగా నుండదు. పోతరాజునకు మల్లన యను కుమారుఁడు గలఁడు ఆ మల్లనయే ప్రౌఢకవి మల్లన యనుటనుగూర్చి యింకను విచారింపవలసి యున్నది. ఏది యెట్లయినను పోతరాజకృతభాగవతము కొంతవఱకు ప్రభ్రష్టమగుటయు దాని నీ గంగనాదులు పూరించుటయు మాత్రము వాస్తవము.

పోతన సంస్కృతాంధ్రములను తాను గురుముఖమునఁ జదువక స్వయంకృషి వలననే యనర్గళమై యుభయభాషాపాండిత్యమును సంపాదించిన వాఁడు, ఈ యొక్క యంశమే యీ కవియొక్క ప్రతిభావిశేషమును వేయినోళ్ళఁ జాటుచున్నది. గురుముఖమున విద్య యభ్యసింపకపోవుట చేతనే యితఁడు గద్యమునందు * సహజపాండిత్య ” యని వేసికొన్నాడు. సహజ పాండిత్యుఁ డగుటచేత నీతని కవిత్వమునందక్కడక్కడఁ గొన్ని వ్యాకరణాదిదోషములు కానవచ్చుచున్నవి. కాని కవిత్వముమాత్రము నిరుపమానమయినదయి సర్వజన శ్లాఘపాత్రముగా నున్నది. పోతన చిన్నతనములో గోవులను మేపుకోనుటకై గ్రామ సమీపమున నున్న యడవికిఁ బోయి నప్పుడు చిదానందుఁడను యోగి యాతనికి రామమంత్రము నుపదేశించి నట్లును, దానినిబట్టియే సమ స్తవిద్యలును నిరవద్యకవిత్వమును వచ్చినట్లును కొందఱు చెప్పుచున్నారు. అయినను " శ్రీపరమేశ్వరకరుణా కలిత కవితా విచిత్ర ” యను భాగవతగద్యమునుబట్టియు వీరభద్రవిజయమునుబట్టియు విచారించి చూడఁగా శివప్రసాదమువలన నీతనికిఁ కవిత్వ మలవడుట కవి యభిప్రాయ మయినట్టు స్పష్టమగుచున్నది. శ్రీరామమూర్తి భాగవతమును తెనిఁగింపవలసినదని చెప్పినట్టు స్వప్నము రాఁగా నితఁడు శ్రీరామాంకితముగా భాగవతపురాణమును తెనిఁగించెను.

ఈ కవి ధనికుఁడుగాక రాజుల నాశ్రయింపక కృషికర్మచేఁ గాలము గడుపుచుండెను. ఇతనిఁ మహత్త్వాదులనుగుఱించి ఇటీవలివారనేక కథలను