Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

589

బ మ్మె ర పో త రా జు

గడిచినందున నొక్కొక్క తరమునకు నలుబదేసి సంవత్సరముల చొప్పునఁ జూచినచో నేడు నలుబదు లిన్నూటయేనుబది సంవత్సరములు 1759 నుండి తీసివేయఁగా 1476 సంవత్సరపాంతమువకును బమ్మెర పోతనార్యుఁడు జీవించి యుండవలెను. ఇందులోనుండి పది పదునేను సంవత్సరములు త్రోసివేసినను పోతన 1460 -వ సంవత్సరము వఱకైనను జీవించి యుండవలెను. ఆతఁడఱుదిసంవత్సరములు జీవించె ననుకొన్నచోఁ బోతనజన్మ దినము 1400 సంవత్సర ప్రాంతమునందయి యుండును. ప్రౌఢసరస్వతి యను బిరుదందిన కేసనకవి. (పోతనమనుమడు) యొక్క దౌహిత్రుడు అజ్జరపు పేరయలింగము తెలుఁగున నొడయనంబివిలాస మను కావ్యమును జేసెను. ఈతనితండ్రి కేసన; తల్లి లక్కమ్మ; కొడుకు మల్లన. ఇతఁడు కౌండిన్యగోత్రుఁడు; నియోగి బ్రాహ్మణుఁడు, ఇతనికి శ్రీనాధకవి బావమరిది యనిచెప్పుదురు. పోతన శ్రీ నాధునిమఱఁది యైనను, కాకపోయినను వీరిరువురును గొంతవఱకేకకాలమువారయి యుండిరనుటకు సందేహము లేదు.[1]

  1. [బమ్మెర పోతన శ్రీనాధుని సమకాలీనుఁ డని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మున్నగువారు తెల్పియున్నారు. 'ఆంధ్రకవి తరంగిణి' కారులు పోతన శ్రీనాధుని సమకాలీకుఁడు కాఁడనుచున్నారు. పోతనామాత్యుడు శ్రీనాధుని బావమఱదికాఁడనియు, 'బాలరసాల సాల నవపల్లవ' ఇత్యాది పద్యము పోతన చెప్పినది కాదని వారి యాశయము. పోతనకును, పేరమంత్రికిని నడుమ నాఱుతరములున్నవనియు, శ్రీ వీరేశలింగం పంతులు గారేడు తరములున్న వనుట సరికాదనియు, తరమునకు 30 లేక ౩౩ సంవత్సరముల లెక్కింపవలసి యుండగా పంతులుగారు నలువది సంవత్సరములు లెక్కించుట సరికాదనియు నందుఁ దెలుపఁబడినది. ( చూ. ఆంధ్రకవి తరంగిణి-ఆఱవసంపుటము, పుట 178 ) మఱియు పోతన రసార్ణవసుధాకర్త యగు సింగభూపాలుని కాలములోని వాఁడు కాడనియు సర్వజ్ఞ బిరుదాంచితుడయి, పదవ తరము వాఁడగు సింగభూపాలుని కాలమున నుండిన వాడనియు శ్రీ ప్రభాకర శాస్త్రులుగారు మున్నగు వారి అభిప్రాయము. పోతన గ్రంధమును సింగభూపాలుఁడు పాతిపెట్టించెనను వదంతి నమ్మరాదనియు విద్వాంసుఁడు, ఉదారుఁడునగు నాప్రభువట్టి పనిచేసి యుండఁడనియు, కూచిమంచి తిమ్మకవి లోకమునందలి వాడుక ననుసరించి యట్లువ్రాసి యుండవచ్చుననియు, వెలిగందల నారయ మున్నగు వారి రచనలు కేవల శిథిల భాగ పూరకములు కాక భాగవత శేష పూరకములే యని విద్వజ్జనుల యాశయము]