Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బమ్మెర పోతరాజు


ఈ కవి శాలివాహనశకము (1300వ సంవత్సరమునం దనఁగా హూణ శకము 1308 వ సంవత్సరమునందు జనన మొందినట్టు తెలుఁగు భాగవతమును ముద్రించినవారు పీఠికయందు వ్రాసియున్నారు. కానీ యది సరియైన సంవత్సరమని తోచదు. పోతన మఱి యిరువది సంవత్సరముల తరువాత నఁనగా హూణశకము 1400 వ సంవత్సర ప్రాంతమున జనన మొంది యుండును. ఈతని నివాసస్థలము నైజాము రాజ్యములోని ఓరుగల్లు. ఇదియే భాగవతమునం దేకశిలానగర మని చెప్పఁబడి యున్నది. ప్రథమమున భాగవతమును ముద్రింపించినవారు బమ్మెర పోతనార్యుని వాస స్థలము కడపమండలములోని యొంటిమెట్ట యనియు, అదియే భాగవతము నందుఁ బేర్కొనఁబడిన యేకశిలానగర మనియు, ఆతని చరిత్రమును దెలుపు పురాతన గ్రంథ మేదియో తమకు లభించినదనియు, పీఠికలో వ్రాసి యుండుటచేత గతానుగతికు లయి జనులా కథనే మొన్న మొన్నటివఱకు నమ్ముచు వచ్చిరి. ఇటీవల విమర్శకులు కొందఱు సత్యమును శోధించి పోతనామాత్యుని వాసస్థాన మోరుగల్లు గాని యొంటిమెట్టి కాదని సహేతుకముగా లోకమునకు వెల్లడించుటచేత మహాజను లిప్పుడు కన్నులు తెఱచి తమ తొంటి ప్రమాదమును దెలిసికొని పూర్వాభిప్రాయమును మార్చుకొనుచున్నారు. అయినను స్థలాభిమానముచేతఁ గొంద ఱిప్పటికిని పోతన జనన భూమి కడపమండలమే యని వాదించువారందందుఁ గనఁబడు చున్నారు. అందుచేత నట్టివారి భ్రాంతినివారణార్థముగా బమ్మెర పోతననివాస మోరుగల్లని స్థాపించుటకుఁ దగిన హేతువులను గొన్నిఁటి నిందుఁ జూపుచున్నాను. ఇంటి పేరునుబట్టి పోతనపితృపితామహాదుల వాసస్థానము బమ్మెర యను గ్రామమయినట్టు సులభముగా తెలిసికోవచ్చును. ఆతఁ డా గ్రామములోనే పుట్టినవాడయినను, ఓరుగల్లు రాజనివాస మయిన మహాపట్టణ మయి యుండుటచేత భాగవతరచన కాలమున కక్కడఁ జేరి యుండును. ఈ బమ్మెర గ్రామ మోరుగంటిని రమారమి మూఁడామడల దూరములో నల్లగొండమండలమునందున్నది. బమ్మెర యను పేరుగల యూ రేదియు