పుట:Aandhrakavula-charitramu.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

579

శ్రీనాథుఁడు

ననియు, అందలి శృంగారము శ్రీనాథుని దాక్షారామాప్సరోభామాదులదానివలె జార స్త్రీపురుషసంబంధమయినది గాక యనింద్యమైన భార్యాభర్తృసంబంధ మయినదనియు, ప్రహసనములలోని విటపురుషదుర్వర్తన ప్రకటనము వీథి నాటకములోనిదానివలే దుర్ణ యపోషణమునకుఁ గాక దుర్జయశోషణమునకును నీతిభంజనమునకుఁగాక దుర్నీతిభంజనమునకును ఉద్దేశింపఁబడెననియు, మా మిత్రు లెఱుంగుదురుగాక ! శ్రీనాధుని పై మోపఁబడిన దోషము స్త్రీవర్ణనములు చేసినందునకును, విటపురుషుల దుర్వర్తనముల వెల్ల డించినందునకును గాదు; స్త్రీలోలుఁడయి వయఃకాలమున విచ్చల విడిగాఁ దిరిగి కాయమును, ధననికాయమును జెడఁగొట్టుకొని కష్టపడవలసిన వృద్ధదశను దెచ్చుకొన్నందునకు, శ్రీనాధుఁడు వేశ్యాప్రియుఁడని యాతనిని గూర్చి వ్రాసినవారందఱును నైకకంఠ్యముతోఁ జెప్పుచున్నారు. వేశ్యలపొందు ధనేకలభ్యమని యెల్లవారును నెఱుఁగుదురు. శ్రీనాధుడు మహారాజుల యొద్ద నాస్థానకవి యయి యపరిమితధనము నార్జించుటయే కాక, వివిధ దేశాధీశుల సభల కరిగి కనకాభిషేకాదులను పొందిన మహానుభావుఁడు. కనకాభిషేకము సామాన్య మయినది కాదు, జలమువలె శిరస్సుపై నీ కనకకలశములతో సువర్ణ ముద్రలతో స్నానము చేయించిన ధనమే బహు సహస్రరూప్యముల గలదయి యుండును. కనకాభిషేకము చేసిన మహారాజు కవిశిరోమణిశిరస్సు పయిని గుమ్మరింపఁబడిన సువర్ణ సహస్రములను కవి కియ్యక తాను మరలఁ గైకొని యుండఁడు. రసిక శిఖామణి యయినకవి కియ్యఁబడిన యటువంటి ధనరాశి వేశ్యల వలలలోఁ దగులుకొన్నప్పు డల్పకాలములో నదృశ్యమగుట వింతకాదు. వేశ్యల యింటిబంటు లైన లక్షాధికారులు నిమిషములో భిక్షాధికారు లగుచుండుట మనము లోకములో నాలోకించు చుండలేదా ? పండితుడు చేసినను, పామరుఁడు చేసినను దోషము దోషమే ! పండితుఁడు చేసినది యొప్పిదమును, పామరుఁడు చేసినది తప్పిదమును గానేరదు. శ్రీనాధుని కవితాచమత్కారమును నాంధ్రసారస్వతమునకుఁ జేసిన మహోపకారమును మెచ్చి యానందించువారిలో నెవ్వరికి నేను దీసిపోవువాఁడను గాను. అయినను సత్యము నపేక్షిం చియు యువజనాభి