పుట:Aandhrakavula-charitramu.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుఁడు

             మ. బలవద్బారహదొంతిమన్నెధరణీపాలావరోధాంగనా
                 విలసన్మంగళసూత్రరక్షణకళావిఖ్యాతకారుణ్య ! యు
                 త్కలకర్ణాటతురుష్కరాట్పరమమిత్రా ! కుండలస్వామికుం
                 డలపూజాపరతంత్రధీవిభవ ! పంటక్ష్మాపచూడామణీ !

అనితల్లి శాసనమువల్ల కాటయవేమునకు కుమారగిరిచెల్లెలయిన మల్లాంబ గాక దొడ్డాంబ యను వేఱొకభార్య యుండినట్టును, అనితల్లి దొడ్డాంబిక కూఁతురయినట్లును దెలియవచ్చుచున్నది. తన సవతితల్లియు, కొండవీటి వారి యాడుఁబడుచును నైన మల్లాంబ తన పేర మల్లవరగ్రామమును బ్రాహ్మణుల కగ్రహారముగా నిచ్చి తొత్తరమూడి శాసనము వ్రాయించినట్లే యీ యనితల్లి తన పేర నన్నవరమును వైద్యున కగ్రహారముగా నిచ్చి కలువచేఱు శాసనమును వ్రాయించెను. మల్లాంబ కట్టించిన మార్కండే యాలయములోనే యనితల్లి మార్కండేయశివసన్నిధిని 1423-వ సంవత్సరమునందు దేవ బ్రాహ్మణ క్షేత్రములమీఁది పన్నును తీసివేసెను. [1]

  1. [ఇయ్యెడ ఆంధ్రకవితరంగిణీ' లో నిట్లున్నది. అనితల్లి భర్తయైన వీరభద్రా రెడ్డి తండ్రి యల్లాడభూపతి, స్వామిద్రోహపరాయణులను వైరి నృపతులనెడి జలరాశిలో మునిగిపోయిన భూమిని శ్రీహరివలె నుద్ధరించినాడనియు, దురిత రహిత చిత్తుఁ డైన యాతఁడు శత్రువశమునుండి తప్పించి యా రాజ్యాధికారమును గాపయ వేమభూపతి కుమార్తెయైన యనితల్లియందుంచి నాఁడనియుఁ, గలువచేఱు శాసనమునందలి 15-49 శ్లోకములలోఁ జెప్పియుండుటచే, ననితల్లి కీ రాజమహేంద్రవరరాజ్యము తల్లి మూలకముగా వచ్చియున్నదని భావింపవలయునని శ్రీనాథచారిత్రము నందు శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసియు, నందే యొక తావున దొడ్డాంబిక యనితల్లికి సవతితల్లి యనియు, సవతితల్లినుండి యా రాజ్యమామెకు సంక్రమించినదనియుఁ జెప్పియున్నారు. రాజమహేంద్రవరరాజ్యమనితల్లిదనుట నిశ్చయమే కాని, యది యెవరి మూలమున వచ్చిన దనుటలోనే వివాద మున్నది. ఆ రాజ్యమును కొమరగిరి రెడ్డి కాటయ వేమన కిచ్చెనని తో త్తరమూడి శాసనమనుచున్నది. అది సత్యమైనచో నా వేమారెడ్డి కనితల్లితప్ప యప్పటికి వేఱు సంతానము లేదు, కావునను, ఆ రాజ్యమున కుత్తరాధికారిణి అనితల్లి తప్ప మఱియొకరు లేనందునను, అల్లాడ రెడ్డి యా రాజ్యభారము ననితల్లియందుంచి, తన యు దారాశయమును గనుపఱచి యుండును, (సంపుటము.5, పుటలు, 71,72)]