Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

578

శ్రీనాథుఁడు

అని తాను కర్ణాటాధీశ్వరుని ముత్యాలశాలలోఁ గనకాభిషేక గౌరవమును బొందినకధను గూడ నిశ్శంకముసో జెప్పుకొనెను, దీనినిబట్టి కొందఱు భీమఖండమును రచించినతరువాతను కాశీఖండము రచియింపకముందును శ్రీనాధుఁడు కర్ణాటక దేశమునకుఁ బోయి యచ్చటఁ దన పాండిత్య ప్రకర్షము చేత డిండిమభట్టు నోడించి కవిసార్వభౌమ బిరుదమును కనకాభి షేకమును గాంచెనని చెప్పుదురు గాని శ్రీనాధమహాకవి రాజమహేంద్రవరమున స్థిర పడినతరువాత దేశాంతరగమనముచేయుట కావశ్యకముకాని యవకాశము కాని కానరాదు.[1]

అల్లాడరెడ్డి పోలయ వేమాదులగు కొండవీటి రెడ్లతోడ సంబంధబాంధవ్యంబున వసుంధరాభారదౌరంధర్యంబు నొందెనని చెప్పఁబడుటయే కాని భీమఖండములో నా బంధుత్వ మెట్టిదో వివరింపఁబడలేదు, కాశీఖండములోని యీ క్రింది పద్యమువలన నల్లాడభూపతి యనవేమారెడ్డిపౌత్రి యైన వేమాంబను వివాహమాడి వేమవీరభద్రాదిపుత్రులను బడసినట్లు బాంధవముమాత్రము తేటపడుచున్నది.

     మ. అనవేమక్షితిపాలపౌత్రి యగు వేమాంబామహాదేవికిన్
         ఘనుఁ డయ్యలడభూమి పాలునకు సంగ్రామస్థలీగాండివుల్
         తనయు ల్వేమవిభుండు ఏరవసుధాధ్యక్షుడు దొడ్డ ప్రభుం
         డును నన్నయ్యయు బాహువిక్రమకళాటోపప్రతాపోద్ధతుల్.

  1. [భీనుఖండమును రచించిన వెంటనే శ్రీనాథునకు వేమ, వీరభద్రా రెడ్ల యాశ్రయము లభింప లేదనియు, వారికిఁ గొండవీటి రెడ్ల యడఁ గల స్పర్థ కొంత తదాశ్రితుఁడగు శ్రీనాధునియెడఁగూడ నుండెననియు, పిదప శ్రీనాథుఁడు ప్రౌఢదేవరాయలు, సర్వజ్ఞ సింగభూపాలుఁడు మున్నగువారి యాస్థానములకరిగి, కనకాభిషేకాది సత్కారములను పొందినపిదప నతని యెడ వారికి విశేషగౌరవమేర్పడి శ్రీనాథునాస్థానకవీశ్వరుని గా గ్రహించిరనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి యభిప్రాయము. (చూ. శృంగారశ్రీనాథము - ఫుటలు 216, 217.]