535
శ్రీనాథుఁడు
సంవత్సరమునకుఁ బూర్వమయి యుండదు. అప్పుడు శ్రీనాధుని ముఖ్యోద్దేశము బెండపూడి యన్నామాత్యునాశ్రయించి తన్మూలమునఁ దనపూర్వపు ప్రభువయిన పెదకోమటి వేమారెడ్డి శత్రువయిన యల్లాడ రెడ్డి పుత్రుల యనుగ్రహమును సంపాదించి సాధ్యమయినంత శీఘ్రముగా వారి యాస్థానమునఁ బ్రవేశించి యచ్చట స్థిరపడుట. ఈ యభీష్టసిద్దికయి యతడు మొట్టమొదట యన్నామాత్యువిఁ బొగడి యతని దయను సంపాదింపవలెను; తరువాత వేమవీరభద్రారెడ్లను బొగడి వారిదయకుఁ బాత్రుఁడు కావలెను. ఈ రెండు పనులును నెఱ వేఱుటకయి యతఁడు భీమేశ్వరపురాణమును తొందర తొందరగా రచియించి దానిని శివభక్తుఁడైన యన్నయమంత్రి కంకిత మొనర్చెను. ఇతఁడు నైషధమహాకావ్యము నాంద్రీకరించి పెదకోమటివేముని మంత్రియైన మామిడిసింగనమంత్రికంకిత మొనర్చినప్పుడు
సీ. తన కృపాణము సముద్ధతవైరిశుద్ఘాంత
తాటంకముల కెగ్గు దలఁచుచుండఁ
దన బాహుపీఠంబు ధరణిభృత్కమరాహి
సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ
దన కీర్తినర్తకి ఘనతర బ్రహ్మాండ
భవనభూములగొండ్లిఁ బరిఢవిల్లఁ
దన దానమహిమ సంతానచింతారత్న
జీమూతసురభుల సిగ్గుపఁఱుప
బరఁగు శ్రీవేమమండలేశ్వరునిమంత్రి
యహితదుర్మంత్రివదనముద్రావతార
శాసనుఁడు రాయ వేశ్యాభుజంగబిరుద
మంత్రి పెద్దనసింగనామాత్యవరుఁడు.
అనియొక్క పద్యములో వేమభూపాలునిమంత్రి యైనట్టు చెప్పి తరువాత కృతిపతివంశాభివర్ణ నము చేసెను. ఈ ప్రకారముగానే యీ భీమఖండమును బెండపూడి యన్నయమంత్రికిఁ గృతి యిచ్చునప్పుడు