పుట:Aandhrakavula-charitramu.pdf/556

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

529

శ్రీనాథుఁడు

       లలి కావ్యనాటకాలంకారచతురుడు
                       సకలశాస్త్రార్ధవిశారదుండు
        వలనొప్ప సింగభూపాలీయనామక
                       గ్రంథంబు రచియించెఁ గౌతుకమున
        మును భాగవతమును దెనుఁగు చేసినయట్టి
                       బమ్మెరపోతన బాగుమీఱ

        తనకుఁ జెప్పిన భోగినీదండకమును
        వెలయ శ్రీనాథనామకవిప్రవరుఁడు
        కోరి చెప్పిన పద్యము ల్గొని ముదాప్తిఁ
        బెంపుతో వారి మన్నించి పేరువడసె.

ఉభయసింగభూపాలురనుగూర్చియు, సింగభూపాలీయములు చేయబడినవి కానీ రెంటికిని మిక్కిలి భేదమున్నది - మొదటిది రసార్ణవ సుథాకరము; [1] రెండవది చమత్కారచంద్రిక, మొదటిది సింగభూపాల రచితము; రెండవది సింగభూపాలాంకితము. రెండును నలంకార విషయకములే ! చమత్కారచంద్రిక యనఁబడెడు రెండవ సింగభూపాలీయము విశ్వేశ్వరకవిచంద్రునిచే రచియింపఁబడినది. అందలి లక్షణముల లక్ష్యములు నరసభూపాలుని పేర జెప్పబడినట్టే సింగభూపాలుని పేరఁ జెప్పఁబడినవి. కవి యీ గ్రంథమునకు సింగభూపాలకీర్తిసుధాసారశీతలనామాంతర[2] ముంచెను. అందలి విలాసాంత గద్యమును జూడుఁడు.

        “ఇతి సరససాహిత్యచాతురీధురీణ విశ్వేశ్వరకవిచంద్ర
         ప్రణీతాయాం శ్రీసింగభూపాలకీర్తిసుధాసారశీతలాయాం
         చమత్కారచంద్రికాయాం అష్టమో విలాసః.”

  1. [రసార్ణవసుధాకరము సింగభూపాల విరచితముకాదేమోయని శ్రీ ప్రభాకరశాస్త్రులు
    గారు సందేహించుచున్నారు. చమత్కారచంద్రికకు సింగభూపాలీయ మను పేరు అప్రసిద్ధము.]
  2. ఇది నామాంతరమైనట్లు తోఁచదు, చమత్కారచంద్రిక కిది విశేషణము.