పుట:Aandhrakavula-charitramu.pdf/548

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

521

శ్రీనాథుఁడు

దేవరాయల యాస్థానమున నుండెననుచున్నారు 'ఆంధ్రకవితరంగిణి' కారులు డాక్టరుగారి మతమునే యంగీకరించుచున్నారు - శ్రీబండారు తమ్మయ్య గారు, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు మున్నగువారు రెండవ దేవరాయల కాలముననే రెండవ డిండిమభట్టుండినట్లు తలంచియున్నారు. శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మగారును తమయభిప్రాయముతో నేకీభవించినట్లు శ్రీతమ్మయ్య గారు తెల్పినారఁట !]

తమ యాస్థానకవి కిట్లు విద్యావివాదములో పరాభవము జరిగిన తరువాత విజయశాలియైన శ్రీనాధసుకవిరాజమౌళికి దీనారములతోను, టంకముల తోను తమ ముత్యాలశాలలో కనకాభిషేకము చేయించి సత్కరించి రాయల వా రాతనిని బంపివేసిరి. దీనారములును, టంకములును రాయలకాలములో వాడుకలో నున్న బంగారునాణెములు. బంగారునాణెములట్లు జలమునువలె శిరస్సుపైఁ గ్రుమ్మరించి స్నానము చేయించినప్పుడవి బహు సహస్రములు కాకపోయినను సహస్రమునకు దక్కువ కాకుండ నైన నుండవచ్చును. డిండిమకవి సార్వభౌమునకు సభలో నవమానమును, తత్ప్రతిపక్షికి బహుమానమును జరిగిన యనంతరమున సహితము డిండిమభట్టును, తత్పుత్రుడును పూర్వగౌరవముతోను, పూర్వబిరుదావళీ తోను పూర్వవిజయడిండిమలతోను, రాయల యాస్థానకవీశ్వరులుగాను, విద్వాంసులుగాను యథాపూర్వముగా నుండినట్లే కనబడుచున్నది. శ్రీనాధునకిట్లు స్వర్ణాభిషేక సమ్మానము జరిగినది రాయల యాస్థానమునందుఁ గాదనియు, నొకానొక దక్షిణ దేశాధీశునిసభలో ననియు

          "దీనారటంకాలఁ దీర్థమాడించితి
          దక్షిణాదీశు ముత్యాలశాల"

అని యుండుటనుబట్టి యొకానొకరు వ్రాసి యున్నారు. ఆ కాలమునందు కర్ణాటక రాజులను దక్షిణాధీశ్వరు లనియు వ్యవహరించుచుండెడువారు, ఈ