Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

515

శ్రీనాథుఁడు

నియోగిపుంగవుఁడు నరసింగరాయల మంత్రి యని సాళువాభ్యుదయమున నున్నది. కావున 'చంద్రశేఖరు క్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమబిరుదు' అనునది స్పష్టముగా నర్థ మగుచున్నది. ఈ నరసింహ రాయలు క్రీ. శ.1450 లో నున్నట్లు తెలియుచున్నది.” అని రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠికలో వ్రాసి యున్నారు. సాళువగుండ నరసింహరాయలు 1450 వ సంవత్సరమునకు పైని 1480-90 సంవత్సర ప్రాంతములయందుండిన వాఁడగుట చేతను, శ్రీనాధకవి 1450వ సంవత్స రమునకు ముందే 1440-45 సంవత్సర ప్రాంతములయందే మృతి నొంది యుండుటచేతను, ఈ కవిసార్వభౌమబిరుదమార్జనకథ 1435-వ సంవత్సర ప్రాంతమున రచింపఁబడిన కాశీఖండరచనమునకుఁ బూర్వమునందే నడచి యుండుట చేతను, శ్రీనాధుఁడు సాళువగుండ నరసింహరాయల యాస్థానములో నుండిన డిండిమభట్టుతో వాదము చేసి జయించుట సంభవింపనేరదు. కాబట్టి శ్రీనాధునిచే నోడఁగొట్టఁబడిన డిండిమభట్టు వేఱొకఁడయి యుండవలెను. ఇప్పుడు డిండిమభట్టు లెందఱు న్నారను ప్రశ్న వచ్చును. ఆ పేరు గలవారు ముగ్గురు నలుగురున్నట్లు తెలియవచ్చుచున్నది.

యోగానంద ప్రహసమునందు తత్కర్తయైన యరుణగిరినాధుఁడు తన మాతామహాఁడు "బ్రహ్మాండభాండ పిచండమండలిత విజయడిండిమచండిముఁ” డనియు, "డిండిమప్రభుఁ" డనియు, చెప్పియున్నాడు. అందుచేత మొట్టమొదట విజయడిండిమమును సంపాదించినవాఁ డష్టభాషాకవితా సామ్రాజ్యాభిషిక్తుఁడై న యీ డిండిమభట్ట కవిసార్వభౌముఁడే యనియు, ఆతని దౌహిత్రుఁడయిన యరుణగిరీనాధునకు డిండిమకవిసార్వభౌమత్వము లభించుట తాతవలననే యనియు, విశదమగుచున్నది. "శ్రీకంఠాగమపారంగతుఁడై విజయడిండిమము నార్జించిన మాతా మహునియొద్ద నుండియే యీ యోగానందప్రసహసన కర్తకు డిండిమకవిసార్వభౌమబిరుదమును, విజయడిండిమమును లభించినవి ” అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ కనకాభిషేకమునందుఁ దెలిపి యున్నారు. ఈ ప్రధమడిండిమభట్టు 1270-వ సంవత్సరమునందు జనన మొంది 1380వ సంవత్సరము వఱకును