Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

513

శ్రీనాథుఁడు

            జవనఘోటకసామంతసరసవీర
            భటనటానేకహాటక ప్రకటగంధ
            సింధురారావమోహనశ్రీలఁ దనరు
            కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

ఈ పద్యము కర్ణాటక రాజదర్శనార్థ మరిగినప్పుడు చెప్పఁబడినది కాకపోయినను శ్రీనాధునిచేఁ జెప్పఁబడిన దగుటకు సందేహములేదు. బహుదినములు విజయనగరములోఁ బ్రవాసాయాసము ననుభవించిన తరువాత తుదకు శ్రీనాథునకు రాజ[1]సందర్శనమ యి బహూకరణము జరిగినది. రాజదర్శనము క్రీడాభిరామకర్త యైన వినుకొండవల్లభరాయని నాశ్రయించి నాతని కంకితముగా వల్లభాభ్యుదయమును జేయుటవలన నాతని మూలమున లభించినదని చెప్పుదురు. వల్లభాభ్యుదయమును నేను జూడలేదు. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠికలో "శ్రీనాధుని వల్లభాభ్యుదయములోఁ గృష్ణాతీరమున నుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటె బచ్చిగా నున్నవి...... మఱియు వల్లభాభ్యుదయమున నాంధ్రవల్లభుని తిరునాళ్ళలోని విధవాదుర్వర్తనములు శ్రీనాధుఁడు విశదముగా వర్ణించి యున్నాఁడు . . . . . శ్రీనాథుడు శ్రీకాకుళాధీశ్వరుఁడగు తెలుఁగురాయని దర్శించి యతని కంకితముగా వల్లభాభ్యుదయము చెప్పెనుగదా!" అని వ్రాసి యున్నారు. ఈ వాక్యములనుబట్టి చూఁడగా వల్లభాభ్యుదయము శ్రీకాకుళాంధ్ర దేవుని యుత్సవములలో నడచుచుండెడు విశ్వస్తాదుల దుర్వర్తనాది వర్ణన ములను గలది యనియు, అది యాంధ్రవిష్ణుదేవునికే యంకిత మొనర్పఁబడిన దనియుఁ దెలియవచ్చుచున్నది.[2]

  1. [ఈ విషయ మిదివరకే చర్చింపఁబడినది]
  2. [వల్లభాభ్యుదయ మింతవఱకును లభింపలేదు. ఆది శ్రీనాథ కవికృత మని కొంద రందురు. అది శ్రీనాధుని వల్లభాభ్యుదయములోనిదిగా నొక పద్యము పెదపాటి జగన్నాథ కవి 'ప్రబంధ రత్నావళి' లో నుదాహరింపcబడినది. వల్లభాభ్యదయకర్త వేరై యుండవచ్చునట ! క్రీడాభిరామము కాక శ్రీనాథుని వీధి నాటకమని మఱియొక పుస్తకము ప్రచారములో నున్నది. అదియే వల్లభాభ్యుదయమని కొందరందురు - అది శ్రీనాథ కృతమనుటకుఁ దగిన యాధారములు లేవు]