పుట:Aandhrakavula-charitramu.pdf/538

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

511

శ్రీనాథుఁడు

ఎంతటి సమర్థుడయినను రాజాశ్రయము లేనిచోట చిరకాలము నిలిచిన యెడల ధనాగమముగాని గౌరవముగాని తగినంత యుండదు. అందుచేత నాతఁ డిప్పుడు రాజాశ్రయము లభింపఁగల స్థల మేదో యొకటి చూచుకొని యచ్చటికిఁ బోవలెను. దేశాభిమానముచేత స్వస్థలమయిన కొండవీటిసీమకు మరలఁ బోఁదలచినచో నా దేశము శత్రుభూక్రాంతమయి రాజులేని భూమియైనది. ఇఁక నప్పుడు ప్రబలమయి యుండిన రెండవ రెడ్డిరాజ్యమైన రాజమహేంద్రవరమునకుఁ బోవలె నన్నచో దానిని పాలించుచుండిన రెడ్డి రాజులు తన కేలికయయి యుండిన పెదకోమటి వేమభూపాలునితోఁ బోరాడి కష్టములపాలయిన యాతని గర్భశత్రువులయి యుండిరి. ఒకవేళ సాహసముచేసి పోయినను వారు తమ శత్రురాజుయొక్క కవీశ్వరు నాదరించి గౌరవింతు రనుట యసంభావ్యము. ఈ హేతువులచేత శ్రీనాథుఁడా కాలము నందు మహాబలిష్టమయి యుండిన కర్ణాటరాజధానికిఁ బోవలసినవాఁడయ్యెను. కర్ణాటక రాజ్య మా కాలమందు ప్రౌఢదేవరాయలచేతఁ బాలింపఁబడు చుండెను. అతఁడు 1423-వ సంవత్సరమునందు సింహాసనమెక్కి 1443-వ సంవత్సరమువఱకును రాజ్యపరిపాలనము చేసెను.

శ్రీనాథకవీంద్రుఁడు కర్ణాటరాజ్యరాజధానికిఁ బోయినప్పుడు డాతని కొక పట్టున రాజదర్శనము లభించినది కాదు. సాధారణముగా పండితు లన్యోన్య మాత్సర్యము గలవారగుటచేత కొత్తగా విదేశమునుండివచ్చిన విద్వాంసునకు భగీరథ ప్రయత్నముమీఁదఁ గాని రాజసందర్శనము కానియ్యరు. రాజసేవకుల నాశ్రయించి ముందుగా వారిని సంతోషపెట్టి, వారి యనుగ్రహమును సంపాదించువఱకును వారు సహిత మభినవాగతుల కనేకములైన ప్రతిబంధములను గల్పించుచుందురు. అందుచేత శ్రీనాథుఁడు రాజసందర్శన మగుటకు ముందా పురమునందు పూఁటకూటి యిండ్లలో వేళగాని వేళలో నపాత్రపు భోజనములు చేయుచు నోట మెతుకులు పడఁగానే యంగిలు తొడిగి, కుళ్ళాయలు పెట్టి తెల్లబట్టలు కట్టి ప్రతిదినమును రాజాస్థానమునకుఁ బోయి రాజసేవకుల ననుసరించుచు బహుదినములు పరదేశములు కష్టపడ