Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

492

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

కవికల్పన కొంత యున్నను హరవిలాసములోని శివలీల లన్నియు శ్రీనాథుని యితర గ్రంథములవలెనే సంస్కృతమునుండి భాషాంతరీకరింపఁబడినవే. శ్రీనాథుఁ డా వఱకు వాడుకలో లేని పదములను నన్యదేశ భాషా పదములను హరవిలాసములోఁ బ్రయోగించుట కారంభించెను. "తరుణా చీనితవాయి" యన్న పద్యములో "సామాను" లని ప్రయోగించుట కనిపెట్టి యున్నారుగదా ! ఈ క్రింది పద్యమున 'ఖుసిమీఱ" నని వాడి యున్నాఁడు.

       మ. ఖుసి [1] మీఱన్ సురథాణి నిండుకొలువై కూర్చన్నచో నీక రా
           భ్యసనంబున్ నుతియించురా యవచి తిప్పా ! చంద్రసారంగనా
           భిసముత్పాదితతాళవృంతపవన ప్రేంఖోలన ప్రక్రియా
           వనరోదంచితసారసౌరభరసవ్యాలంబరోలంబముల్ [పీఠిక–22]

హరవిలాసము రచియింపఁబడినతరువాత నత్యల్పకాలములోనే కుమారగిరి నరపాలుఁడు పరలోకగతుఁ డయ్యెను. అతని యనంతరమునఁ బెదకోమటి వేమభూపాలుఁడే కొండవీటిరాజ్యమున కంతకును బ్రభువయి 1400-వ సంవత్సరములోఁ దనమంత్రియైన మామిడిసింగనామాత్య సహితముగా వచ్చి కొండవీటియందుఁ బ్రవేశించెను. అటుతరువాతఁ గొుతకాలమునకు సింగనామాత్యుని యనుగ్రహమువలన శ్రీనాధునకుఁ మొదట రాజస్థానప్రవేశము కలిగెను. శ్రీనాథుఁడు వేమనృపాలుని యాస్థానమునందు విద్యాధికారిగా నియమింపఁబడినందున నప్పటినుండి స్థిరముగా కొండవీటినివాసుఁడయ్యెను.

ఈ పెదకోమటివేమభూపాలునియొద్ద శ్రీనాథుఁ డాంధ్రకవిగాను, పార్వతీ పరిణయమును రచించిన వామనభట్టు సంస్కృతకవిగాను ఉండిరి. వామనభట్టు సంస్కృతమున వేమభూపాలీయ మను పేర నీతని గూర్చియే యొక వచనకావ్యమును రచించెను. వేమభూపాలీయమునందు వామనభ ట్టితనిని సర్వజ్ఞ చక్రవర్తినిగాను, ఈతని పూర్వులను మహాచక్రవర్తులనుగాను పొగడెను. వేమభూపాలునకు దాను గ్రంథభర్త యగుటకంటె గ్రంథకర్త

  1. విూఁదన్- పాఠాంతరము