పుట:Aandhrakavula-charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

24

ఆంధ్ర కవుల చరిత్రము

విజయాదిత్యునికుమారుఁడు పులికేశివల్లభుఁడు. ఈ పులికేశివల్లభుని జ్యేష్ట పుత్రుఁడు కీర్తివర్మ పృధివీవల్లభుఁడు. ఇతడు క్రీస్తుశకము 563 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కీర్తివర్మ యొక్క ప్రధమపుత్రుఁడగు సత్యాశ్రయుఁడన్న బిరుదనామము గల (రెండవ) పులికేశివల్లభుఁడు తన పినతండ్రియైన మంగళేశుని తరువాత 610 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చెను. ఈ సత్యాశ్రయుఁడు మిగుల బలవంతుఁడయి బహు దేశములనుజయించి, యాకాలమునందు సిద్ధపుర మనఁబడెడి పీఠికాపురమునందలి దుస్సాధ్యమయిన దుర్గమును బట్టుకొనెను. ఈ యుద్ధములయం దీతనికిఁ దమ్ముఁడు ను యువరాజు నయిన కుబ్జవిష్ణువర్ధనుఁడు మిక్కిలి సహాయుఁడయి యుండెను కీర్తివర్మ యొక్క ద్వితీయపుత్రుఁడయిన కుబ్జవిష్ణువర్ధనుఁడు 615 వ సంవత్సరమునందు వేఁగి దేశమును బాలించుట కయి యన్నగా రయిన సత్యాశ్రయునిచే నియమింపబడెను. కాని యతఁడు కొంతకాలము లోనే స్వతంత్రుఁడయి తూర్పుచాళుక్యరాజులకు మూలపురుషుఁ డయి పూర్వ చాళుక్యరాజ్య స్థాపకుఁడయ్యెను. వేఁగిదేశము బౌద్దమతస్థులగు సాలంకాయనరాజులనుండి కైకొనబడినదగుటచే, ఈ కుబ్జవిష్ణువర్ధనుని రాజ్యములోనే యాంధ్రదేశమునందు బౌద్దమతమునకు క్షీణత్వమును బ్రాహ్మణ మతమునకుఁ బ్రాబల్యమును ప్రారంభ మయ్యెను. ఈ చాళుక్య రాజులు శైవులగు బ్రాహ్మణ మతస్తులు, మానవ్యగోత్రులు.

1. కుబ్జవిష్ణువర్ధనుఁడు - ఇతఁడు పైనిజెప్పినట్టు 615 వ సంవత్సరమున చైత్రశుద్ద పూర్జిమ తరువాత రాజ్యమునకు వచ్చి 6౩౩ వ సంవత్సరము వఱకును బదునెనిమిదిసంవత్సరములు రాజ్యము చేసెను. ఇతఁడు మొదటి విష్ణువర్ధనుఁడు. ఈ విష్ణువర్ధనుఁడు దిమిలిసీమలోని కలవకొండ గ్రామమును దనరాజ్య కాలముయెుక్క- పదునెనిమిదవ సంవత్సరమున శాలివాహనశకము 555 శ్రావణ శుద్ధ పూర్ణిమనాఁటి ( క్రీస్తు శకము 632 వ సంవత్సరము జూలయినెల యేడవ తేది) చంద్రగ్రహణ సమయమునందు విష్ణుశర్మ మాధవశర్మ యను బ్రాహ్మణులకు దానము చేసినట్లున్న దానశాసనమునుబట్టి యీతని రాజ్యము విశాఖపట్టణమండలములోని సర్వసిద్ధితాలూకాలోని దిమిలిసీమ పై వఱకును వ్యాపించి యుండినట్టు స్పష్టమగుచున్నది.