477
శ్రీనాథుఁడు
అని కవియే చెప్పుకొని యుండుటచేత నిరువది రెండేండ్ల ప్రాయమున ననగా 1387-వ సంవత్సరప్రాంతమున శాలివాహనసప్తశతి రచియింపఁబడి యుండును. అటు తరువాత రెండు మూఁడేండ్ల కనఁగా 1390-వ సంవత్సర ప్రాంతమున శ్రీనాథుని కిరువదియైదేం డ్లుండి నప్పడు పండితారాధ్య చరిత్రము రచింపఁబడి యుండును. శ్రీనాథుని ప్రసిద్ధి యంతయు నైషథ కావ్యరచనమునుండి యారంభమైనది. అంతకుఁ బూర్వపు గ్రంథము లన్నియు నించుమించుగా నామమాత్రావశిష్టము లయినవి. ఒక్క పల్నాటి వీరచరిత్రములోని కొంతభాగము మాత్రము కనఁబడుచున్నది. అవి నామమాత్రావశిష్టములయినను కాకపోయినను నాకు మాత్రము దొరకలేదు. శ్రీనాధుని సప్తశతిలోని దని యే గ్రంథములోనుండియో యెత్తి శ్రీమానవల్లి రామకృష్ణకవిగారీ పద్యము నుదాహరించి యున్నారు.
ఉ. వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేఁటి క్రొ
వ్వారుచు నుంట నీ వెఱుగవా ? ప్రియ ! హా తెఱగంటిగంటి కె
వ్వారికిఁ గెంవు రాదె ? తగవా మగవారల దూఱ నీ విభుం
డారసి నీనిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.[1]
నైషధమునుగూర్చి శ్రీనాధుడే తన కాశీఖండమునందు
"సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్ష నైషథకావ్య మాంధ్రభాష"
నని సంపూర్ణయౌవనదశయందు రచించినట్టు చెప్పెను. కాబట్టి శ్రీనాథుఁడు తాను ముప్పది సంవత్సరముల వయస్సులో నున్నప్పు డనఁగా 1395-ప సంవత్సరప్రాంతమున నైషథమును రచించి యుండును. ఇది పెద్దకోమటి వేమన్న చిన్నసంస్థానాధిపతిగా నున్న కాలములోనే యాతని మంత్రి యైన
- ↑ [ఇయ్యది శాలివాహనసప్తశతిలోనిదనియే పలువురి విశ్వాసము. పెదకోమటి వేమభూపాలుఁడీ గ్రంథమునుజూచి యుండవచ్చునని శ్రీప్రభాకరశాస్త్రులు గారి యభిప్రాయము.]