Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

473

శ్రీనాథుఁడు

ప్రతాపరుద్రమహారాజులకాలములో నుండి యాతనిచే సమ్మావింపఁబడి యున్నవాఁ డనుటకు సందేహము లేదు. అతఁడా గ్రామకరణ మగుటచే నాతవి పుత్రుఁడును శ్రీనాధునితండ్రియు నగు మారయయు నా గ్రామము నందే యుండి కరణీకవృత్తిచేసి జీవనముచేయుచు నుండి యుండవచ్చును. శ్రీనాధుడు తన తాతను గూర్చియే కాని యే పుస్తకమునందును తండ్రిని గూర్చి యంతగాఁ జెప్పి యుండలేదు. అతఁడొక వేళ నిజముగా పండిత పుత్రుఁడేయేమో ! తాతయే శ్రీనాథునికిఁ జిన్నప్పడు విద్యయుఁ గవిత్వమును నేర్పియుండును. భీమఖండకృతిపతి కమలనాభుని నెఱిఁగి యుండినట్టు చెప్పుటచేత నతఁడు 1380 -వ సంవత్సరమువఱకైన బ్రతికి యుండవచ్చును. అప్పటికి శ్రీనాథునికి తప్పక పదునేను సంవత్సరములకు తక్కువకాని యీడుండును. దానినిబట్టి శ్రీనాధుడు 1365-వ సంవత్సర ప్రాంతమున జననమొంది యుండును. శ్రీనాధుఁడు తన పదునాఱవ సంవ త్సరప్రాంతముననే గ్రంథరచనమున కారంభించె ననుటకు సందేహములేదు.

       'చిన్నారిపొన్నారిచిఱుతకూకటినాఁడు
        రచియించితి మరుత్తరాట్చరిత్ర.'

అను కాశీఖండములోని పద్య మీ యంశమునకు సాక్ష్యమిచ్చుచున్నది. కాఁబట్టి యీతఁడీ మరుత్తరాట్చరిత్రమును పదునెనిమిదేండ్లలోపల నింటికడ నున్నప్పడే రచియించి యుండును. కాబట్టి మరుత్తరాట్చరిత్రము 1383-వ సంవత్సరప్రాంతమున రచించెనని చెప్పవచ్చును. నా కీ పుస్తకము లభింపనందున శైలి యెట్లున్నదో యందు వ్యాకరణాదిదోషములేమయిన నుండినవో యది యెవ్వరికైన నంకితము చేయబడినదో లేదో చెప్పఁజాలను. ఈతఁడు చేసిన రెండవ గ్రంథము పల్నాటి వీరచరిత్రము నందలి బాలునికథ. ఇదియు నింటికడ నున్నప్పడే స్వగ్రామమునందలి పల్నాటివీరుల కులమువారి ప్రోత్సాహముచేత నీతనిచేత రచియింపఁబడి యుండును. ఈ పుస్తకరచనమువలన శ్రీనాధునకుఁ గొంత ధనలాభము