శ్రీనాథుఁడు
శ్రీనాథుఁ డను కవి శైవు డైన పొఁకనాటి నియోగి బ్రాహ్మణుఁడు; భారద్వాజగోత్రుఁడు; ఆప స్తంభసూత్రుఁడు. ఇతని తండ్రి మారయ; తల్లి భీమాంబ. తాత కమలనాభుఁడు. కమలనాథకవి పద్యపురాణసంగ్రహమును జేసిన ట్లీ కవి భీమఖండములోని యీ క్రింది పద్యముచేతఁ జెప్పుచున్నాఁడు.
మ. "కనకక్ష్మాధరధీరు వారిధితటీక్రాల్పట్టణాధీశ్వరున్
ఘనునింబద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభా మాత్యచూడామణిన్"
శ్రీనాధుఁడు పాకనాటివాఁ డగుటచేతను, తాత సముద్రతీరపట్టణమున కధికారి యయి యుండుటచేతను, నెల్లూరిసీమలోని యేదో సముద్రతీరగ్రామ నివాసి యయి యుండును. క్రాల్పట్టణ మేదో క్రొత్తపట్టణము. ఒకవేళ నిజముగానే కొత్తపట్టణ మయి యుండవచ్చును. క్రాల్పట్టణము ప్రకాశించు పట్టణము. క్రొత్తది ప్రకాశించును గనుక క్రొత్తపట్టణ మన వచ్చును. "వినమత్కాకతిసార్వభౌము" నని చెప్పట చేతఁ గమలనాభా మాత్యుఁడు 1320 వ సంవత్సరప్రాంతమున కాకతి ప్రతాపరుద్రసార్వభౌమునికాలములొ క్రొత్తట్టణమునకు కరణముగా నుండి యుండును.
[శ్రీనాథుడు కర్ణాటకుఁడనియు, అతని తాత నివాసస్థానము పశ్చిమ సముద్ర తిరమునఁ గల పట్టణములలో నొకటియై యుండుననియుఁ గొందఱి యభిప్రాయము "శ్రీనాధుని కూరిమిసేయు మఱఁది" నని దగ్గుబల్లి - దుగ్గన చెప్పటచే శ్రీనాధుడు కర్ణాటుఁ డనుట పొసగదు. కాల్పట్టమే కాలపట్టణ మనియు, అది నల్లని పట్టణము-అనఁగా కృష్ణపట్టణమనియు, ఆది నెల్లూరు చేరువ నున్నదనియు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారి యాశయము.క్రాల్పట్టణము - క్రాల్పట్టణమై - అదియే క్రొత్తపట్టణ మనుట సరికాదనియు,