పుట:Aandhrakavula-charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

ఆంధ్ర కవుల చరిత్రము

హరివంశమును గృతిఁగొన్న పోలయవేమారెడ్డి 1349 వ సంవత్సరము వఱకు రాజ్యపాలనము చేసినవాఁడు. వీరి వాదమును బట్టి తిక్కనసోమయాజి తరువాత నేఁబదిసంవత్సరముల కుండిన ఎఱ్ఱాప్రెగడ కాలమునాఁటికిఁ దిక్కన భారతము పదునేను పర్వములు నశింపకుండఁగా, గతించిన యిన్నూట యేబదిసంవత్సరములనుండి నన్నయభారతములోని రెండు పర్వముల మూఁడా శ్వాసములు నశింపకుండఁగా, నిరువది ముప్పదిసంవత్సరముల లోపల నారణ్యపర్వము నాల్గవయాశ్వాసములోని "శారదరాత్రు" లన్న పద్యము నుండి మాత్రము కారణము లేకయే యొక్కసారిగా నాంధ్రదేశములో నున్న యన్ని ప్రతులలోను మాయ మయ్యె నఁట ! ఇది వివేకులు నమ్మఁదగిన మాట గాదు. నన్నయభట్టు మూఁడవపర్వమునఁ గూడ మూఁడా శ్వాసములు పైగా రచియించి యుండుటచేతఁ దిక్కనసోమయాజి రెండుపర్వముల మూఁడా శ్వాసముల 542 పద్యము లని విశేషముగాఁ చెప్పక సామాన్య ముగా మూడుకృతులని చెప్పినవాఁడు. అంతే కాని వేఱేమియు లేదు. లోక వ్యహారమునందు సహిత మొక సభకు వచ్చిన జనులు లెక్కకుసరిగా 836 గురే యున్నను మనము సామాన్యముగా వేయిమంది వచ్చిరనియే చెప్పుదుము. మిగిలిన భాగమును రచియించిన ఎఱ్ఱాప్రెగడ,

           క. ధీరవిచారుఁడు తత్కవి
                 తారీతియుఁ గొంతదోఁపఁ దద్రదనయకా
                 నారణ్యపర్వశేషము
                 పూరించెఁ గవీంద్రకర్ణపుట పేయముగాన్.

అని తా నారణ్యపర్వశేషమును బూరించితినని చెప్పెను. శేష మనఁగా మిగిలినది యని యర్ధపు గదా ! నన్నయభట్టారకుఁడు రచింపఁగా మిగిలినదనక పోయినయెడల నిచ్చట శేషశబ్దమున కర్థ మే మగును? ఎఱ్ఱాప్రెగడ సహితము నన్నయభట్టారణ్యపర్వమును గొంత చేసెననియు, చేయఁగా మిగిలిన దానిని దాను జేసితిననియు, తెలుపుట కొఱకే శేషశబ్దమును ప్రయోగించెను.