పుట:Aandhrakavula-charitramu.pdf/466

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

439

రా వి పా టి తి ప్ప న్న

       ఉ. కూడెడివెండ్రుకల్ నిడదకూఁకటిఁ బ్రోవఁగ బొడ్డుపై వళుల్
          జాడలు దోపఁ గ్రొమ్మొలకచన్నులు మించు దొలంక సిగ్గునం
          జూడఁగ నేరముల్ మెఱుఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ
          వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా !


4. మ ద న వి జ య ము


ఈ క్రింది పద్యములు రెండును మదనవిజయములోనివని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు త్రిపురాంతకోదాహరణ పీఠికలో నుదాహరించిరి.

       క. సతి గుణవతి యగునేనియు
          బతి కది రత్నంబ ప్రాణబంధువ యమృతం;
          బతివయ దుర్గుణి యగునేఁ
          బతి కెడపని చిచ్చు కాలుపక యది కాల్చున్

      మ. గుణమున్ సుందరరూపమున్ విభవముం గూటంబు సౌభాగ్యల
          క్షణముం జారుచరిత్రమున్ వినయమున్ జాతుర్యమున్ ధర్మభూ
          షణముం గల్గి పతివ్రతామహిమ మించన్ గల్గెనేఁ దత్సతీ
          మణి చింతామణి, దాని దాల్పఁ గలగన్ మర్త్యుండె ధన్యుండిలన్