Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రావిపాటి తిప్పన్న


ఈ తిప్పన్ననే త్రిపురాంతకుఁ డనియుఁ జెప్పదురు. ఈతఁడు చేసిన గ్రంథములలో త్రిపురాంతకోదాహరణము ముఖ్యమైనది. ఒక్కొక్క విభక్త్యంతమున నొక్కొక్క పద్యమును గలదయి ప్రతి పద్యము తరువాతను నొక్కొక్కకళికను దానితరువాత నొక్కొక్క యుక్కళికను గల గ్రంథ ముదాహరణ మని చెప్పఁబడుచుండెను. నన్నయాదులకుఁ బూర్వమునందును తత్కాలము నందును తెలుఁగున సాధారణముగా నుదాహరణగ్రంధములే ప్రబలముగా నుండి జనులచే నాదరింపఁబడుచుండెను. నన్నయాదులు భారతాది మహా కావ్యములను రచియింప నారంభించిన తరువాత నుదాహరణ గ్రంథములు మూలcబడి [1] క్షుద్రకావ్యములుగాఁ బరిగణింపఁబడుచుండెను. అయినను త్రిపురాంతకుఁడు శేషనార్యుఁడు మొదలైనవారు కొందఱప్పుడప్పుడుదాహరణ గ్రంథములను సహితము చేయుచు వచ్చిరి. ఈ తిప్పన యుదా హరణ గ్రంథమును గాక మదనవిజయము, చంద్రతారావళి, అంబికాశతకములను కూడ విరచించెను. ఈ కవి కాలమిదియని నిర్థారణ చేయుటకుఁ దగిన యాధారము లంతగాఁ గానరావు. అప్పకవి అప్పకవీయమున యతి ప్రాస ప్రకరణమైన మూcడవయాశ్వాసమున ననుస్వారసంబంధయతి కుదాహరణముగా రావిపాటి తిప్పన్న చాటుధార యని యీ క్రింది పద్యము నుదాహరించియున్నాcడు.

     మ. సరి బేసై రిపుడేల భాస్క_రులు? భాషానాధపుత్రా వసుం
         ధరయం దొక్కఁడు మంత్రియయ్యె వినుకొండ న్రామయామాత్యభా
         స్కరుఁడో?యౌ నయినన్ సహస్రకర శాఖ ల్లేవవే యున్నవే
         తిరమై దానము చేయచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయచో

ద్వాత్రింశన్మంత్రుల చరితములో రాయని భాస్కరుని కధయం దుదా హరింపఁబడిన యీ పద్యమున రామయామాత్యభాస్కరుఁ డనుటకు మాఱుగా రాయనామాత్యభాస్కరుఁడని యున్నది.

  1. [క్షుద్ర కావ్యమనఁగా చిన్నకావ్యము. నీచమైన కావ్యమని యర్థము చేసికొనుట పొరపాటు.]