పుట:Aandhrakavula-charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16

ఆంధ్ర కవుల చరిత్రము

నాయకుని కిచ్చినట్టియు, కాలెరగ్రహారమును దాక్షారామపీఠికాపురసత్రములను జరుపుటకయి ముద్గలగోత్రుఁడును పోతనార్యపుత్రుఁడును నయిన మేడమార్యుcడను బ్రాహ్మణున కిచ్చినట్టియు, దానశాసనములనుబట్టి రాజరాజనరేంద్రుని పుత్రుఁడైన ప్రధమ కులోత్తుంగచోళదేవుఁడు శాలివాహనశకము 986 వ సంవత్సర మనఁగా క్రీస్తుశకము 1063 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినట్టు చెప్పఁబడి యున్నది. ఇందువలన రాజరాజనరేంద్రుఁడు 1022 వ సంవత్సరము మొదలుకొని 1063 వ సంవత్సరము వఱకు 41 సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు సిద్ధాంత మేర్పడుచున్నది. కనుక. *[1] తదాస్థానపండితుcడయిన నన్నయభట్టారకుఁడును 1022 వ సంవత్సర ప్రాంతము మొదలుకొని యున్నవాఁడనుట స్పష్టము. ♦[2] కాబట్టి నన్నయభట్టు కాల మిప్పటికి 860 సంవత్సరము లయి యున్నది. భారత రచనమునందు నన్నయభట్టున కత్యంత సహాయుఁడుగా నుండిన నారాయణ భట్టునకు రాజరాజనరేంద్రుఁడు తన రాజ్యపాలనముయెుక్క ముప్పది రెండవ సంవత్సరమునందు నందమపూడి యను గ్రామము నగ్రహారముగా నిచ్చెను. ఈ గ్రామము గౌతమీ వైనతేయనదుల మధ్యమున నప్పడు రెండేరులవాడి విషయమనఁబడెడి యిప్పటి యమలాపురము తాలూకాలో నున్నది.

"ద్వాత్త్రింశత్తమే విజయ రాజ్యవర్షే వర్ధమానే కృత మిదం శాసనమ్" అని ముప్పది రెండవయేట ననియు, 'సోమగ్రహణనిమిత్తే . . . దత్తమ్" అని చంద్రగ్రహణసమయమునం దనియు, దానశాసనమునందుఁ జెప్పఁబడి యుండుటచేత దానకాలము శాలివాహనశకము 975 వ సంవత్సరము మార్గశీర్ష శుద్ద పూర్ణిమాభానువారమనఁగా క్రీస్తుశకము 1053 వ సంవత్సరము నవంబరునెల 28 వ తేది యగుచున్నది. ఈ శాసనమునందు నారాయణభట్టిట్లు వర్ణింపఁబడి యున్నాడు.

  1. * తదనుజో విమలాదిత్య స్సప్త, తత్పుత్రో రాజరాజ దేవ ఏకచత్వారింశత్". తత్పత్రశ్శ్రీకులోత్తంగచోడ దేవ ఏకోనపంచాశత్" . . . . రాజ్యంప్రశాసతి.
  2. ♦ ఇది క్రీ. శ 1022 వ సం.రము ఆగస్టు నెల 16వ తేదీకి సరిపడునని చరిత్ర కారుల యాభిప్రాయమైనట్టు ' ఆంధ్ర కవితరంగిణి ' లో గలదు.[పుట 109 ] ఈ ఆంధ్రకవుల చరిత్రమునను 23-వ పుటలో నిట్లే కలదు.