పుట:Aandhrakavula-charitramu.pdf/428

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

401

మ డి కి సిం గ న్న

గణపతి ద్వితీయపత్రుఁడబ్పయామాత్యుఁడు. అబ్బయామాత్యుని తృతీయపుత్రుడు కందనమంత్రి, కందనమంత్రి తాతతాత యైన గన్నయమంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండిన ట్లతనిఁగూర్చిన పద్మ పురాణములోని యీ క్రింది పద్యమువలన దెలియుచున్నది.

       చ. "పరువడిఁ గాకతీయ గణపక్షితినాయకునొద్ద మాన్యుఁడై
           ధరణిఁ బ్రశస్తుఁడె నెగడి దానము లెల్లను జేసి భక్తిపెం
           పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపన్
           దిరమగుచున్నలక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వ మేర్పడన్

కాకతీయ గణపతిరాజు 1200 వ సంవత్సరము మొదలుకొని 1260 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినవాఁ డగుటచేత నాతనికి మాన్యుఁడై యుండిన గన్నయ మంత్రి 1260 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవచ్చును. ఈతని సంతతి వారికి తర మొకటికి నలుబదేసి సంవత్సరములు వయోవ్యత్యాసము నేర్పఱచినచో గన్నయ మంత్రిపుత్రుఁడైన మల్లన 1300-వ సంవత్సరప్రాంతమునం దుండును.మల్లన కొడుకైన గణపతి 1340 వ సంవత్సర ప్రాంతమునందుండును. గణపతి కుమారుఁ డైన యబ్బయ 1380-వ సంవత్సరము ప్రాంతమునందుండును. అబ్బయామాత్యుని నందనుఁడును పద్మపురాణకృతి పతియు నైన కందన మంత్రి 1420 వ సంవత్సరప్రాంతమునం దుండును. మడికిసింగనార్యుఁడు తాను పద్మపురాణమును ముగించిన సంవత్సర మిదియే యని పుస్తకాంతమునందీ పద్యమునఁ జెప్పెను.

                      మంగళమహాశ్రీవృత్తము

  ఆకరయుగానల మృగాంకశకవత్సరములై పరఁగు శార్వరీని బుణ్య
  ప్రాకటిత మార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
  శ్రీకరముగా మడికిసింగన తెనుంగున రచించెఁ దగ బద్మసుపురాణం
  బాకమలమిత్రశిశిరాంశువుగఁ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ