Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

ఆంధ్ర కవుల చరిత్రము

దండెత్తి వచ్చి యీ దేశమును పాలించుచుcడిన త్రిలోచనపల్లవునితో యుద్ధము చేసి రణనిహతుఁ డయినట్టును, భర్త వెంట వచ్చిన యాతని భార్య గర్భవతియై యుండియు నా యాపత్సమయములోఁ బురోహితునిని గొందఱు పరిచారికలను వెంటఁగొని ముదివేము అగ్రహారమునకుఁ దప్పించుకొని పాఱిపోగా విష్ణుభట్టసోమయాజి యను బ్రాహ్మణుఁ డామె నాదరించి తన యింటఁ బెట్టుకొని తానుగన్న కొమార్తెనువలెఁ జూచి యామె గర్భమున జనించిన పురుష శిశువునకు రాజోచితము లయిన జాతకర్మాది సంస్కారములు నడిపి విష్ణువర్ధనుఁ డని పేరుపెట్టి పెంచినట్టును, ఆతడు తన తల్లి వలన సర్వవృత్తాంతమును విని చళుక్యపర్వతమునకుఁ బోయి తపస్సుచేసి తన తండ్రి రాజ్యమును వహించి, కదంబులను గాంగులను జయించి నర్మద మొదలుకొని సేతుపు వఱకునున్న యేడుకోట్ల యేఁబదిలక్షల గ్రామములుగల దేశమునంతను పాలించినట్టును, చెప్పఁబడి యున్నది. అప్పటినుండియు నాతని వంశమువారికి విష్ణువర్ధనుడను బిరుదు పేరు పరంపరగా వచ్చుచున్నది. ఈ చళుక్యవంశపురాజులు రెండు శాఖలవారయి యెుక శాఖవారు కళ్యాణపురమునందును రెండవశాఖవారు రాజమహేంద్రవరమునందును రాజ్యము చేయుచుండిరి. వీరిలోఁ గళ్యాణపురము రాజధానిగాఁగల పడమటి చాళుక్యులు కుంతలరాజులనియు, రాజమహేంద్రవరము రాజధానిగాఁగల తూర్పుచాళుక్యులు వేఁగిరాజు లనియు వ్యవహరింపఁబడుచు వచ్చిరి. ఈ విష్ణువర్ధనునిముమ్మనుమడయిన కుబ్జవిష్ణువర్షనుఁడు క్రీస్తుశకము 615 వ సంవత్సరమునందు వేఁగిదేశమునకు మొదటఁ దనయన్నమైన సత్యాశ్రయునిచేఁ బాలకుఁడుగా నియమింపఁబడి పిమ్మట దానేఁ రాజయ్యెను. అతని కిరువదియేడవతరమువాఁడయిన విమలాదిత్యుఁడు 1015 వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి యేడుసంవత్సరములు రాజ్యముచేసి మృతినొందఁగాఁ దెలుఁగుభారతమును గృతినందిన యాతని కొడుకు విష్ణువర్ధనుఁడను రాజనరేంద్రుఁడు శాలివాహనశకము 644 వ సంవత్సరము శ్రావణ బహుళ