పుట:Aandhrakavula-charitramu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వే ము ల వా డ భీ మ క వి

[1] భీమకవి యొక్క వాసస్థానము గోదావరిమండలములోని దాక్షారామమునకు సమీపమున నున్న వేములవాడ యను గ్రామము. [2] ఇతని జన్మమును గుఱించి విచిత్రమైన కథ యొకటి చెప్పుచున్నారు. వేములవాడ గ్రామము వందు సోమన యను నియోగిబ్రాహ్మణుఁ డొకఁ డుండెను. ఆతనిమరణానంతర మతనిభార్య నిరుపేదరాలైనను విద్యావతి యగుటచే ధనికుల యిండ్లలో పాటలను, పద్యములును చెప్పి జీవనము చేయుచుండెను. ఆమె శివరాత్రి పుణ్యకాలమునందు తనయూరిస్త్రీలతోఁ గలిసి దాక్షారామమునకు యాత్రపోయి వా రందఱును తమకు సంతానముఁ గలిగింపవలె నని భీమేశ్వరస్వామికి మొక్కుకొనుచుండగా, తన కిఁక సంతానము. గలుగబోదన్ననమ్మకముతో పరిహాసార్థముగా తనకు కొడుకు పుట్టినయెడల తానును స్వామికి పుట్టెడు నీటితో దీపారాధనము చేయించెదనని మొక్కుకొనెను. ఆమె మాటల కప్పు డచ్చట నున్న స్త్రీ లందఱును నవ్విరి. ఆమె యిల్లు చేరిన తరువాత కొంతకాలమునకు దైవ మామె కోరికను సఫలముచేసెనో యన్నట్లా వితంతువున కెట్లో విధివశముచేత గర్భము నిలిచెమ ! తాను భక్తితో మొక్కుకొన్నందున శ్రీభీమేశ్వర స్వామియే చూలు కలిగించెనని యామె యెంత చెప్పినను నమ్మక, ఆమె నా యూరివా రందఱును జాతినుండి బహిష్కరించి తమఇండ్లకు రానీ కుండిరి. ఆమె కటుపిమ్మట పురుషశిశువు కలుగఁగా మిక్కిలి ప్రేమతో బెంచుచు, ఆతనికి భీమేశ్వరస్వామి పేరు పెట్టి, తానే యాతనికి చిన్నప్పటి నుండియు విద్య చెప్పచుండెను. ఈ భీమన తాను పిల్లవాండ్రతో నాడు

  1. [ఇతని చరిత్ర తిక్కనచరిత్రకు ముందు రావలసినది.]
  2. [భీమకవి నివాసము నిజాము రాష్ట్రములోని వేములవాడ యనియు, అచటి రాజేశ్వరుఁడే భీమేశ్వరుఁడనియు శ్రీ జయంతి రామయ్యపంతులుగా రభిప్రాయపడి యున్నారు. గోదావరి మండలములోని వేములనాడయే భీమకవి నివాసమని 'ఆంధ్ర కవితరంగిణి'లోఁ జెప్పఁబడినది. (పు. 217)]