Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాచన సోముఁడు


నాచన సోముఁ డనెడి కవి యెఱ్ఱాప్రెగడ కిరువది ముప్పది సంవత్సరముల తరువాత సుప్రసిద్దపండితకవిగా నుండినవాఁడు. ఈ కవి యెఱ్ఱాప్రెగడ వృద్దదశలో బాలుఁడయి కొంతకాలము సమకాలీనుఁడయి యుండి యుండ వచ్చును. ఇతcడు రచించిన హరివంశముయొక్క మొదటియాశ్వాసము లోని యవతారిక మాకు దొరకనందున కవియొక్క గోత్రాదులను చెప్పఁ జాలము. ఇతఁడు నియోగి, నాచన కొమారుఁడు. [నాచన సోముఁడు. అనుచోఁ గల "నాచన" శబ్దము వంశనామమో, పితృనామమో స్పష్టముగాఁ దెలియుట లేదనియు, శాసనములోని 'సోమాయ నాచనాంభోధే - సోమాయ" అని యుండుటచే వంశనామమే యని యూహీంప నవకాశ మున్నను, కొక్కోక కవి యెఱ్ఱన సోమన నాచన సుతుఁడని చెప్పుటచేతను, సింహాసన ద్వాత్రింశతికను రచించిన కొఱవి గోపరాజు "నాచిరాజు సోమన" యని పేర్కొనుటచేతను, "నాచన" యనునది తండ్రి పేరే యని నిశ్చయింప వచ్చుననియు 'ఆంధ్రకవి తరంగిణి' (నాలుగవ సంపుటము, పు 116)లోఁ జెప్పఁబడినది. ఇతఁడు తన గ్రంధమును నెల్లూరియందలి హరిహరనాధునకు గృతి యిచ్చుటచేత నీతనినివాసస్థలము నెల్లూరిమండలములోని యేదో గ్రామమని తోఁచున్నది. యెఱ్ఱాప్రెగడ చేసిన హరివంశము ప్రౌఢముగా నుండలేదన్న యభిప్రాయముతో నీతడీ యుత్తర హరివంశమును రచించినట్టు కనఁబడుచున్నది. [నాచన సోముఁడు. యెఱ్ఱాప్రెగడ వలెనే హరివంశము నందలి పూర్వోత్తరభాగములను రెండింటిని రచించెనని *ఆంధ్రకవి తరంగిణి" కర్త, మఱికొందఱును తలంచుచున్నారు. ఇతని పూర్వహరివంశ మెచ్చటను లభింపలేదు. ఇతఁడు త్తర హరివంశమునే రచించియుండునని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మున్నగువారి యాశయము. సోమన పూర్వ హరివంశమునుకూడ రచించెననుటకుఁ దగిన ప్రమాణములు కావలసి యున్నది. [ఇంచుమించుగా నెఱ్ఱనయ, సోమనాథుఁడు నేకకాలీనులు గనుక, శంభుదాసునికవిత్వమునందీత నికంత గౌరవము కలిగి యుండకపోవచ్చును.