Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

331

హు ళ క్కి భా స్క రు డు

యీ బుద్ధరాజగనో, కాఁడో యని సందేహింపవలసినదిగా నున్నది.సందేహింపవలయు నను టేల ? కాలవ్యత్యాసమునుబట్టి కాఁడనియే నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఆ బుద్ధరాజీ బుద్దరాజు తాత కావచ్చును, లేదా యీతనితో సంబంధమే లేని వేరొక బుద్ధరాజు కావచ్చును. సాహిణి మారన్న ద్వితీయ ప్రతాపరుద్రునికాలములో నాతని యశ్వసేనాధ్యక్షుఁడుగా నుండి తద్రాజ్యము తురుష్కాక్రాంతమైన యనంతరమున స్వతంత్రుఁ డయి యొక దేశ పాలకుఁ డయ్యెను. భాస్కరరామాయణ మా కాలమునందే రచియింపఁబడి 1330-వ సంవత్సర ప్రాంతమునం దీ సాహిణిమారన కంకిత మొనర్చబడి యుండును. సాహిణి మారన రాజయినట్లే క్రింది హుళక్కి భాస్కరుని చాటుధారను బట్టి సులభముగా దెలిసికోవచ్చును.

       క. అప్పు లిడునతఁడు ఘనుఁడా ?
           యప్పు డొసఁగి మరలఁ జెందునాతఁడు రాజా ?
           చెప్పఁగవలె సాహిణి మా
           రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్

మారన్న రాజనియు, సేనాధిపతి యనియు స్థాపించు పద్యములు రామాయణములోనే యున్నవి.

        క. శ్రీరామాకుచయుగళీ
           హారిద్రోల్లసితవక్షహరిచరణసరో
           జారాధ్యుఁడు మారయధర
           ణీరమణోత్తముఁడు సాహిణీ తిలక మిలన్.
                                            [ఆరణ్యకాండము, ఆ 2--]

       శా. లాటీచందనచర్చ చోళ మహిళాలావణ్యసామగ్రి క
           ర్ణాటీగీతకలాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా
           వాటీమంజరి గౌడవామనయనావక్షోజహారాళియై
           సాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ! సాహిణీ !
                                            [కిష్కింధాకొండము, 8-26]