పుట:Aandhrakavula-charitramu.pdf/345

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

318

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           చ. అలఘుని శబ్దశాసనపదాంకితుc దిక్కనసోమయాజి ని
                శ్చలమతి శంభుదాసు బుధసన్నుతు నాచన సోమనార్యుఁ జె
                న్నలరిన చిమ్మపూడి యమరాధిపు భాస్కరు రంగనాధునిం
                దలఁతు నపూర్వదివ్యకవితామహనీయసమగ్రచిత్తులన్.
                                                   [నూతనకవి సూరన్న]

             ఉ. ఇద్ధగుణుం బ్రబంధపరమేశ్వరు నెఱ్ఱనప్రెగ్గడన్ మనః
                 పద్దతి నిల్పి సూక్తిరుచిభాస్కరుఁ డైన హుళక్కిభాస్కరున్
                 బుద్ధి ఘటించి సంతతము పూని భజించి వచః ప్రసాదసం
                 సిద్ధునిఁ జిమ్మపూడి కులశేఖరు నయ్యమరేశసత్కవిన్. [1]
                                                   [అంగర నృసింహకవి]

ఇట్లు పదునేనవ శతాబ్దారంభమునుండియు నున్న మహాకవీశ్వరు లీతనిని సత్కవీంద్రునినిగాఁ బొగడుచు వచ్చుటచేత జిమ్మపూడి యమరేశ్వరుఁడు పదునాల్గవ శతాబ్దారంభమునం చనఁగా నెఱ్ఱాప్రెగడ కాలమునందో, కొంచె మీవలనో యున్నట్టు నిశ్చయింపవచ్పును. విక్రమసేనమును సంపాదింప వలెనని నేను జిరకాలమునుండి కృషి చేయుచుంటిని. గాని నా కృషి యింతవఱకును సఫలమయినది కాదు. ఇట్లుండఁగా 1909 వ సంవత్సరము ఏప్రిల్ నెలలో నా మిత్రులయిన మానవల్లి రామకృష్ణకవిగారు తాము ప్రకటించిన క్రీడాభిరామముయొక్క యాచ్ఛాదనపత్రముపైని చిమ్మపూడి యమరేశ్వరుని విక్రమసేన మచ్చులో నున్నదని ప్రచురించుట జూచి యా మహాగ్రంథము శీఘ్రకాలములోనే నా కరస్థము కాగలదు గదా యని యపరిమితానందము నొందితిని. వా రా సంవత్సరమునందే డిసెంబరునెలలో ప్రకటించిన నన్నెచోడుని కుమారసంభవ ప్రథమభాగాచ్చాదనపత్రముమీద సహితము విక్రమసేన మచ్చులో నున్నట్టే ముద్రింపఁ

  1. [వినుకొండ వల్లభరాయకృతిగా శ్రీనాథుcడు రచించినదని చెప్పఁబడుచున్న క్రీడాభిరామమున చిమ్మపూడి అమరాధిపుని ప్రశంసకలదు. కాన నితఁడు 13 వ శతాబ్దిమధ్యమున నుండియుండ వచ్చును.]