పుట:Aandhrakavula-charitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

(11) రాజరాజనరేంద్రుని రాజ్యకాలముసఁ దొలి దినములలో బేతనభట్టను శాసనరచయిత యుండెను. ఇతని కాలము క్రీ. శ. 1022 ప్రాంతమనుట సుస్పష్టము. ఇతఁడు కోరుమిల్లి శాసనమునకుఁ గర్త. ఈ శాసనము, రాజనరేంద్రుఁడు చంద్రగ్రహణకాలమున వీదమార్యుఁడను సద్బ్రాహ్మణునికి కోరుమిల్లి గ్రామ మగ్రహారముగా నొనరించి దానము చేసిన విషయమును తెల్పుచున్నది. ఇది సంస్కృతమయము. కావి యిది దేశీయచ్ఛందస్సగు రగడ యొక్క లక్షణములను గలిగియుండుటవలన - బేతనభట్టు తెనుఁగు కవి యగుట స్పష్టమని శ్రీ వేంకటరావుగారు తెలుపుచున్నారు15. కాని దీనిం బట్టి బేతనభట్టు తెనుఁగులక్షణ సంప్రదాయముల నెఱిఁగినవాఁడని మాత్రము నిశ్చయింపవచ్చును.


ఈ రీతిని పద్యమయశాసనములేకాక గద్య శాసనములును పెక్కు కానవచ్చుచున్నవి. అయ్యవి క్రీ. శ. 575 ప్రాంతము నుండియు వెలసినవి లభ్యములగుచున్నవి. కాని యవి యన్నియు వాఙ్మయఖండములని గాని, శాసన కర్తలు రచయితలని గాని చెప్పట కవకాశము తక్కువ. ఇట్లే నన్నయకుఁ బూర్వమున నుండిన పద్యశాసనములను బట్టియు గవులను నిర్ణయించుట కింకను పరిశోధనలు జరుగవలసి యున్నవి.

పయి యంశములను బట్టి నన్నయకుఁ బూర్వము కూడ తెలుఁగుకవిత వెలసి యుండెననియు, అయ్యయ్యది గ్రంధరూపముగ నుండినచో అనుపలబ్దమనియు మాత్రము చెప్పవచ్చును

(15) చూ. తెనుఁగు కవుల చరిత్ర. పుట 112.