పుట:Aandhrakavula-charitramu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

311

వి న్న కో ట పె ద్ద న్న

లేదు గాని యీతఁడు పదునాలవ శతాబ్దారంభమున నున్న ట్లూహించుట కవకాశము కలిగియున్నది. విశ్వేశ్వరరాజు విశాఖపట్టణమండలములోవి సర్వసిద్ధి కీశాన్యమూలను మూఁడుక్రోసులదూరములో నున్న పంచధారల వద్ద ధర్మలింగేశ్వరస్వామి కొక మండపమును కట్టించినాఁడు. ధర్మలింగేశ్వర స్వామివారి యాలయములోని శిలాశాసనములో మండపము కట్టిన సంవత్సరము తెలుపఁబడకపోయినను, ఆతని వంశవృక్ష మీ ప్రకారముగా లిఖింపఁ బడినది. భీమేశ్వరుని కొడుకు విమలాదిత్యుఁడు, విమలాదిత్యునిపుత్రుఁడు రాజనరేంద్రుఁడు, రాజనరేంద్రుని సుతుఁడు కులోత్తుంగచోళుఁడు, కులోత్తుంగచోళుని తనయుఁడు విమలాదిత్యుఁడు, విమలాదిత్యుని యాత్మజుఁడు మల్లప్ప దేవుఁడు, మల్లప్ప దేవుని సూనుఁ డుపేంద్రుఁడు, ఉపేంద్రుని నందనుఁడు కొప్పభూపుఁడు, కొప్పభూపనితనూజుఁడు మనమోపేంద్రుఁడు, మనమోపేంద్రుని కుమారుఁడు విశ్వేశ్వరభూపుఁడు.

దీనినిబట్టిచూడఁగా విశ్వేశ్వరరాజు రాజనరేంద్రున కేడవ మనుమcడైనట్టు తెలియవచ్చుచున్నది, రాజనరేంద్రుఁడు 1064 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు మనకుఁ దెలియును. తక్కిన విశ్వేశ్వరుని పూర్వు లాఱుగురును ఒక్కొక్కరు నలువదేసి సంవత్సరములు రాజ్యముచేసిరనుకొన్నను విశ్వేశ్వరునికాలము (పదుమూడువందల నాలుగు) 1304 వ సంవత్సరమకంటెఁ దరువాత నారంభము కాదు. కావ్యాలంకారచూడామణి యం దీ రాజవంశము పూర్ణముగా తెలుపఁబడకపోయినను, తెలుపబడి నంతవఱకు పయి వంశవృక్షముతో నేకీభవించుననుట నా పుస్తకములోని యీ క్రింది పద్యమువలనఁ దెలిసికోవచ్చును.

            సీ. శ్రీకంఠచూడాగ్రశృంగారకరణ మే
                          రాజున కన్వయారంభగురుఁడు
                చాళుక్యవంశభూషణము శ్రీవిష్ణువ
                          ర్ధనుఁ డే మహీశుతాతలకుఁ దాత
                భృతకుమారారామభీముండు చాళుక్య
                         భీముఁ డే నృపకళాబ్దికి విధుండు