పుట:Aandhrakavula-charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

భారతమునందలి విరాటపర్వమును రచించినట్లు తెలియుచున్నది. రాయల కాలము నాఁటివాఁడగు 'ఎడపాటి - ఎఱ్ఱన' తన ' మల్హణ చరిత్ర' లో సర్వదేవుని స్తుతించి యున్నాఁడు. కన్నడమున సుప్రసిద్దుఁడగు పొన్నకవి సర్వదేవుఁడని ప్రసిద్ధుఁడనియు, రాష్ట్రకూట రాజగు మూఁడవ కృష్ణచక్రవర్తి కాలమున నుండినవాఁడనియు, పంపకవి 'ఆదిపురాణము' ను కన్నడమున రచింపఁగా పొన్నకవి దానిని తెలుఁగున రచించి యుండుననియు శ్రీ వేంకట రావుగా రభిప్రాయపడుచున్నారు12. లభించిన పద్యములను జూడఁగా నవి ప్రాచీనతర రచనముగాఁ దోపఁకున్నదని శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తెల్పఁగా ' మనకు దొరకిన రెండు మూఁడు పద్యములతోడనే కావ్యకవితా ప్రాచీనతా నవీనతలను నిర్ణయింపరా' దని డాక్టరు నేలటూరి - వేంకటరమణయ్య గారును, శ్రీ వేంకటరావుగారును తెల్పుచున్నారు13


(9) విజయాదిత్యుఁడను నామాంతరము గల బాదపమహారాజు పదియవ శతాబ్ది చివఱి భాగమున నుండినట్టు అయ్యనభట్టు రచించిన "ఆరుంబాక" శాసనము వలనఁ దెలియుచున్నది. శాసనమంతయు సంస్కృతమయము. అయినను కందపద్య లక్షణముతోఁ గూడిన యొక పద్య మందుండుటఁ బట్టి అయ్యనభట్టాంధ్ర కవి యగునని శ్రీ వేంకటరావుగా రనుచున్నారు14. కాని, శాసనరచయిత యాంధ్రుఁడనుటలో నిది హేతువు కావచ్చును. ఆతc డాంధ్రకవి యనుట కింకను ప్రబలమగు హేతువు కావలసి యున్నది.


(10) క్రీ. శ. 1000 ప్రాంతమునందలిదగు విరియాల కామసాని గూడూరు శాసనము తెలుగు పద్యములగు చంపకోత్పలమాలికలతోఁ గూడియున్నది. శాసనమునందుఁ బ్రస్తుతింపఁబడిన మొదటి బేతరాజు శా. శ. 950 నాఁటి వాఁడు. కావున అతని కాలము క్రీ. శ. 1028 అని చెప్పవచ్చును. ఆందు వలన నీ శాసనము క్రీ. శ. 1000 ప్రాంతములోనిదని చెప్పవచ్చును. శాసన కద యెవ్వరై నదియుఁ దెలియుటలేదు.

    (12) చూ. తెనుఁగు కవుల చరిత్ర. పుట 94. 
    (13) చూ. ఉదయని, మే నెల సంచిక 1936. తెనుంగుకవుల చరిత్ర పుట 98. 
    (14) "తెనుఁగుకవుల చరిత్ర, పుట 98.(12)