కాచవిభుఁడును, విట్ఠలరాజును
ఈ కవులిరువురును రంగనాథరామాయణమును రచియించినట్లు చెప్పబడి యున్న బుద్ధరాజు యొక్క పుత్రులు. వీరు పదుమూడవ శతాబ్దమధ్యమున నుండి యందురు. వీ రిరువురును జేరి తమ తండ్రి యాజ్ఞ చొప్పన నుత్తరరామాయణమును ద్విపదకావ్యమునుగా రచియించినట్లు గ్రంథాది యందువ్న పీఠికవలనఁ దెలియవచ్చుచున్నది.
ద్వి. కోనకులార్ణవకువలయేశుండు
నా నొప్పు కోటగన్న క్షితీంద్రునకు [1]
ననఘాత్మ యగుచున్న యన్నమాంబికకుఁ
దనయుండు బుద్ధాభిధానండు పనుప
నారయ మత్స్యకూర్మాది దివ్యావ
తారంబులం దెల్లఁ దలంచి చూడంగ
రామావతారంబు రమణీయ మగుట
రామపావనచరిత్రము దివ్యభాష
లోకానురంజనశ్లోకబంధములఁ
జేకొని వాల్మీకి చెప్పినజాడ
మా తండ్రి బుద్ధక్షమానాథుపేర
నాతతనృపకైరవాప్తుని పేర
ఘనుఁడు మీసరగండకాచవిభుండు
వినుతశీలుఁడు పిన విఠలభూపతియు
నని జనుల్ మముఁ గొనియాడంగ మేము
వినుతనూతనపదద్విపదరూపమున
- ↑ [బుద్ధరాజుతండ్రి విట్ఠల రాజని రంగనాథ రామాయణము]