Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర కవుల చరిత్రము

____________________________________________________________________________


అవతారిక


దేశాభ్యున్నతికిని, భాషావాఙ్మముల తత్త్వపరిశీలనమునకును చరిత్రము మిక్కిలి యావశ్యకము. చరిత్రలేని దేశముగాని, భాష గాని, వాఙ్మయము గాని నాగరకతా ముద్రను పొందఁజాలపు. భారతదేశము నందేగాక దేశాంతరములందును పేరుప్రతిష్టలు సంపాదించిన ఆంధ్రభాషావాఙ్మయముల చరిత్ర మందరికికిని ఉపాధేయము. ఈ గ్రంధమునందుఁ బ్రత్యేకముగ ఆంధ్ర వాజ్మయాభివృద్ధికి దోహద మొనర్చి, పోషించిన కవుల గూర్చిన విషయ ములు విపులముగ నీయఁబడినవి.


ప్రాచీన కాలమునుండియు నాంధ్రులు సుప్రసిద్దులయి, తమ విశిష్టతను నిలుపుకొనుచున్నారు. వేదకాలమునందును ఆంధ్రులు ప్రసిద్దులు. ఆంధ్రు లొకప్పడు భారతదేశమునందలి విశాల భాగమునకుఁ బ్రభువులై యవిచ్ఛిన్నముగ రాజ్యపాలన మొనర్పుటమేగాక, పెక్కు ఘనకార్యముల నొనర్చి నట్లును, భాషా వాఙ్మయములను పోషించినట్లును తెలియుచున్నది.

ప్రాచీనాంధ్ర ప్రభువులగు శాతవాహనులు సుప్రసిద్దులు, శక కర్తలు. హాలుఁడు ప్రాకృతమున గొప్ప విద్వాంసుఁడై గాథా సప్తశతిని గూర్చిన యంశము విద్వద్విదితము. ఇట్లే ప్రాచీనాంధ్రులగు ప్రభువర్యులు సంస్కృతమును, ప్రాకృతమును బోషించి, ఆ వాఙ్మయములందు పెక్కు- ఉద్గ్రంథములు వెలువడుటకుఁ గారణభూతులయిరి,