పుట:Aandhrakavula-charitramu.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

247

పాలకురికి సోమనాథుఁడు

ప్రధానములు వీనిలో బండితారాధ్యచరితమును శ్రీనాధుఁడును, బసవపురాణమును పిడుపర్తి సోమనార్యుఁడుసు. పద్యకావ్యమునుగాఁ జేసిరి.

ఒకనాఁడు ప్రతాపరుద్రుఁ డోరుగల్లుపురమున శివాలయమునకుఁ బోయినప్పుడు శైవులు మండపముమీదఁ గూరుచుండి పాల్కురికి సోమనారాధ్య కృత మయిన బసవపురాణమును వినుచుండిరి. వారిని జూచి రా "జది యే'మని యడుగఁగా వెంట నున్న ధూర్త బ్రాహ్మణుఁ డొకఁడు 'మొన్న నీ నడుమను పాల్కురికి సోమపతితుఁడు మధ్యవళ్ళు పెట్టి యల్లిన యప్రమాణ బసవద్విపద పురాణ పఠన" మని పలికెను. అందుమీఁద శివ భక్తులు పోయి పొరుగూర నున్న సోమనారాధ్యున కా వృత్తాంతమును దెలుపఁగాఁ బ్రతివాదులను జయించుటకయి బయలుదేఱి యతఁ డోరుగల్లు పురమునకు శిష్యబృందముతో వచ్చెను. అతనిరాక యెఱిఁగి యేకశిలా నగరమునందలి బ్రాహ్మణధూర్తులాతని నవమానించుటకయి యా యూరనుండు మత్తులయిన మొండివాండ్రు మొదలయినవారికి విభూతిరుద్రాక్షాదులు పెట్టి శిష్యబృందమును వలె వారి కెదురుగాఁ బంపిరి. [1] తరువాత సోమనార్యుఁ డా పురిఁ బ్రవేశించి ప్రతిపక్షులతో వాదించి గెలిచి రాజానుగ్రహము సంపాదించి కొంతకాల మా యూర నుండి, ప్రతాపరుద్రుని మంత్రియు, సోమనార్యుని శిష్యుఁడు నగు [2] నిందుటూరి యన్నయా మాత్యునిసాహాయ్యమున దొంకిపర్తి మొదలయిన కొన్ని గ్రామములను బడసి శిష్యుల కిచ్చి, తానాపట్టణము విడిచి కలికె మను గ్రామమునకుఁ బోయి యచ్చట శివసాయుజ్యమును పొందెను. ఈ యంశములు కొండవీటి చరిత్రము వలనను, బసవపురాణ పద్యకావ్యపీఠికయందలి యీ క్రింది పద్యాదుల వలనను దెలిసికోవచ్చును.

       సీ. ఒకనాఁడు శివభక్తు లోరుగంటను స్వయం
                       భూదేవు మండపమున వసించి

  1. [ సోమనాథుని మహత్తువలన అవి యధార్థములే యయి, ఆ వేషధారులా పిదప సోమనాథునికి శిష్యులైరcట!]
  2. [ఇతఁడిందులూరి, అన్నయమంత్రి]