Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

163

తి క్క న సో మ యా జి

4. నిర్వచనోత్తరరామాయణములో రావణకుబేరయుద్ధవర్ణనమునందున్న

     " శా. శ్రావ్యంబై చెలఁగన్ గభీరమధురజ్యానాద ముద్దామవీ
            రవ్యాపారనిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్
            సవ్యప్రౌఢి దృఢాపసవ్యతిగ నాశ్చర్యంబుగా నేయుచున్
            దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగన్."

అను పద్యము మార్పేమియు లేకయే విరాటపర్వమున నుత్తరగోగ్రహణమునందు ద్రోణాచార్యయుద్ధవర్ణనములో చేయఁబడెను.

తిక్కన మొదట రచించిన పర్వములను జూచి వానియందు విశేషవృత్తములు లేకపోఁగా పండితు లాతఁడు సామాన్యవృత్తములతో కాలము గడుపుచున్నాడే కాని యపూర్వవృత్తరచనాకుశలుఁడు కాడని యాక్షేపించినమీఁదట నతఁడు, స్త్రీపర్వమునందు బహధ వృత్తములను రచియించె నన్న వాడుక కూడ తిక్కనసోమయాజులు తాను రచియించుచు వచ్చిన గ్రంధమును పండితులకుఁ జూపుచు వచ్చెననుటను స్థాపించుచున్నది. తిక్కనసోమయాజి రచియించిన పదునేను పర్వములలోను నలువది యాఱాశ్వాసములకంటె నెక్కువగ్రంధము లేదు. ఒక్కొక్క యాశ్వాసమునకు నాలుగువందల యేఁబదేసి పద్యముల చొప్పున లెక్క చూచినను శ్రీమహాభారతములో తిక్కనసోమయాజి రచియించిన భాగమంతలోను నించుమించుగా నిరువదివేల పద్యములకంటె నధిక ముండవు. దినమునకు పది పద్యముల చొప్పున రచియించినను, ఇంత గ్రంధము నయిదాఱు సంవత్సరములలో రచియింపవచ్చును. కాcబట్టి యిట్టి గ్రంధరచన యొక యసాధ్యములోనిది కాదు. కాని తిక్కనసోమయాజి శైలితో సమానముగా వ్రాయుట మాత్ర మెవ్వరికిని సాధ్యము కాదు. తెలుఁగుభాషయందెన్నో గ్రంథము లున్నను, తిక్కనసోమయాజికవిత్వముతో సమానముగాఁగాని దానిని మించునట్లుగాఁగాని కవిత్వము చెప్పిఁగలిగిన వారు నేఁటివఱ కొక్కరును కనఁబడలేదు; తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమయి మిక్కిలి రసవంతముగా నుండును; ఈతని కవిత్వమునందు పాదపూరణమునకయి తెచ్చిపెట్టుకొనెడు