160
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
దానిని మరల నడుగక వ్రాయఁగల శక్తి యున్నదట. దీనినిబట్టి చూడఁగాఁ బూర్వకాలమునందు బ్రాహ్మణేతరులలో సహితము చక్కఁగా చదువుకొన్నవా రండియున్నట్టు విదిత మగుచున్నది. ఈ భారతమును రచియించునప్పడు తిక్కనసోమయాజి తడవుకొనకుండ కవిత్వమును జెప్పెదమనియు, తా నొక్కసారి చెప్పిన దానిని మరలఁ జెప్పననియు చెప్పినదాని నెప్పుడును మరల మార్చుకొనననియు ప్రతిజ్ఞ చేసినట్లును, చెప్పిన మాటను మరల నడుగక గురునాధుఁడు వ్రాయుచుండఁగా శల్య పర్వములో ప్రథమాశ్వాసము కడపట సహదేవుఁడు శకునిని చంపిన తరువాత దుర్యోధనుఁడు తోలఁగి పోయెనని ధృతరాష్ట్రునితో చెప్పు భాగమున
క.'పలపలని మూఁకలోఁ గా
ల్నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీ కొడుకు గదా
కలితభుజుఁడగుచు నొక్క.ఁడుఁ
దొలఁగి చనియె.'
అన్నంతవఱకు పద్యమును చెప్పి తరువాత నేమియు తోఁచక తిక్కన
"యేమిచెప్పుదు న్గురునాథా" యని కుమ్మర గురునాధు నడిగినట్లును, అతఁ
డది తన్నడిగిన పళ్నగా భావింపక పద్యముతోఁ జేర్చి
"తొలఁగి చనియె నేమిచెప్పుదు న్గురునాథా"!'
యని వ్రాసినట్లును, అప్పడు తిక్కనసోమయాజి తన ప్రతిజ్ఞకు భంగము వచ్చెనని చింతించుచుండఁగా 'నేమి చెప్పదు న్గురునాథా" యని కవి లేఖకునిగూర్చి యుద్దేశించినది ' కురునాథా ' యని ధృతరాష్ట్రున కన్వయించి యా ప్రశ్నయే పద్యపూరణమున కనుకూలించెనని గురునాధుఁ డాతని నూరార్చినట్లను, ఒక కథను జెప్పదురు. శ్రీమహాభారతము నాంధ్రీకరించిన యీమహాకవి కీ చిఱు పద్యములోని యల్పభాగము తోఁచకపోయె నని సాధించుట కీ కథ పనికిరాదు గాని తిక్కనకవి యాశధారగా కవిత్వము చెప్పఁగలవాఁడని స్థాపించుటకయి కల్పింపఁబడెనని మాత్ర మూహింపఁదగియున్నది.