పుట:Aandhrakavula-charitramu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

కవితిక్కన నియోగిబ్రాహ్మణుఁడు. ఈతనిపూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలములోని వెల్లటూరు గ్రామమనియు, ఉద్యోగధర్మము చేత వా రీతనితాత కాలమున గుంటూరునకు వచ్చిరనియు, తరువాత నెల్లూరిరాజగు మనుమసిద్ది యీతనికుటుంబము నాదరించి నెల్లూరికిఁ దీసికొనివచ్చి పూర్వము హరిహరదేవాలయ ముండిన యిప్పటి రంగనాయకస్వామి యాలయసమీపమున గృహము కట్టించి యిచ్చి తిక్కనసోమయాజుల నం దుంచె ననియూ, మనుమసిద్ది మరణముతో నా రాజవంశ మంతరింపఁగా సోమయాజుల కొడుకు కొమ్మన్న పాటూరి కరిణికము సంపాదించి నెల్లూరు విడిచి యందు వసించెననియు చెప్పచున్నారు. ఈ పాటూరి గ్రామము నెల్లూరికి పడమట రెండు మూఁడు క్రోసుల దూరమున నుత్తరపినాకినీతీరమునం దున్నది. ఈ కవియొక్క- పితృపితామహులది గుంటూరగుటచేత నీతనియింటిపేరు గుంటూరివా రని చెప్పదురు. నా కిటీవల లభించిన కేతనకృత మైన దశకుమారచరిత్రమునుబట్టి చూడఁగా దిక్కనసోమయాజి యింటిపేరు కొట్టరువువారయినట్టు తెలియవచ్చినది. తిక్కనసోమయాజి కంకితముచేయcబడిన యీ గ్రంధమునం దీతని వంశావళి సమగ్రముగా వర్ణింపఁబడినది. దశకుమారచరిత్రమునందు సోమయాజి తాత యైన మంత్రిభాస్కరుఁ డిట్లు వర్ణింపcబడెను.

   శా. 'శాపానుగ్రహశక్తియుక్తుఁ డమలాచారుండు సాహిత్యవి
        ద్యాపారీణుఁడు ధర్మమార్గపధికసం డర్ధార్ధిలోకావన
        వ్యాపారవ్రతుఁ డంచుఁ జెప్ప సుజనవ్రాతంబు గౌరీపతి
        శ్రీపాదప్రవణాంతరంగు విబుధ శ్రేయస్కరున్ భాస్కరున్.'

కృతికర్త యీ భాస్కరమంత్రి గ్రంథరచన చేసినట్టు చెప్పకపోయినను "శాపానుగ్రహశక్తియు క్తుఁడు" అనియు, "సాహిత్యవిద్యాపారీణుఁడు" అనియు చెప్పటచేతనే యాతఁడు కవియైన ట్టూహ చేయవచ్చును. కవి యటుతరువాత భాస్కరునికి నలుగురు పుత్రులయినట్లీ క్రింది పద్యములలోఁ జెప్పెను.