పుట:Aandhrakavula-charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

127

తిక్కన సోమయాజి

కారాబద్దునిగా జేసి ఢిల్లీ నగరముకుఁ గొనిపోవుటయు, సుప్రసిద్దములైన చరిత్రాంశములు ప్రతాపరుద్రునికి బూర్వమునం దాతనితల్లి తల్లియైన రుద్రమదేవి తన తండ్రి మరిణానంతరము. క్రీస్తుశకఁము 1260-వ సంవత్సరము మొదలుకొని 1295 వ సంవత్సరము వఱకును ముప్పది యైదు సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దానశాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది -

       సీ. 'తదనంతరమునఁ బ్రతాపరుద్రతక్షమా
                        జాని సింహాసనాసీనుఁ జేయఁ
           దలఁచి రుద్రమదేవి తా శివ దేవయ్య
                        గారిని రావించి కడఁక .....
           పాదంబులకు నా నృపాలుచే మ్రొక్కించి
                   యా యయ్యచే భూతి నతని నొసలఁ
           బెట్టించి ధరణికిఁ బట్టాభిషిక్తునిఁ
                   గావించి యా రుద్ర దేవనృపుని

           నాయనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
           బుధజనంబులుఁ బ్రజలను బొగడ నవని
           ముప్పదియునెన్మిదేఁడులు మోద మొదవ
           నేలి కైలాసశిఖరికి నేఁగుటయును'

కాబట్టి యీమె తండ్రి యైన గణపతి దేవుఁడు 1260 వఱకును రాజ్య భారము వహించి యుండవలెను. "గణపతిదేవమహారాజచంద్రుం డేఁబది యెనిమిది హాయనంబులు మహామహిమతోడ రాజ్యంబు పాలించె" నని సోమదేవరాజీయము ద్వితీయాశ్వాసమునఁ జెప్పఁబడియుండుటచేత గణపతి దేవుఁడు పదుమూఁడవ శతాబ్దారంభము నుండియు భూపరిపాలనము చేసి యుండవలెను. ఇప్పడు దొరకినంతవఱ కాతని దానశాసనము లన్నియు