Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాఁతపుస్తకములను సహితము వారు మంచియుపయోగమునకుఁ దెత్తురన్న యుద్దేశముతో నితరులకిచ్చి వేసితిని; కవులను గొందఱిని గూర్చి తరువాతివా రప్పడప్పడు పత్రికలలో వ్రాయుచు వచ్చినవానిని జాగ్రత్తచేసి యుంచక చదివినవాని నెప్పటికప్పుడే యొక మూలపాఱవైచి యశ్రద్ధచేసి వాని వలనిలాభమును బోఁగొట్టుకొంటిని. ఇట్లుండఁగా నీనడుమ నొక రిద్దఱు భాషాభిమానులొకానొక యాంధ్రకవిని గూర్చి పత్రికలలో వ్రాయుచు తత్కవులను గూర్చి నేను పడినప్రమాదములను నాపుస్తకము నందలిలోపములను సుహృద్భావముతో వ్యక్తీకరింపఁ బ్రయత్నింపక తాము వ్రాసినవ్యాసములలో నాయజ్ఞతను గూర్చి యించుక నిందాగర్భముగా వ్రాయc జొచ్చిరి.నేనట్టినిందకు సంవూర్ణార్హుఁడనే యయినను నాకు మహోపకారము లయిన వారిదూషణభాషణములు ప్రకృతిదౌర్బల్యదోషమునుబట్టి నాకుఁ గొంత రోషమును పుట్టించి యీసారి నా కవులచరిత్రమును చేతనైనంతవఱకు సంస్కరించి మఱి ప్రకటింపవలె నన్నబుద్ధిని నా హృదయములో నంకురింపఁ జేసినవి. ఈబుద్ధి పుట్టుట చేత నావఱకే కొంత కాలమునుండి పునర్ముద్రణము నపేక్షించి యున్నకవులచరిత్రము నీసారి దిద్ది మఱి ప్రకటింపవలెనని నిశ్చయము చేసికొంటిని. ఇట్లు నిశ్చయము చేసికొన్న దినముననే యీశ్వరమహిమ యేమోకాని కారణములేకయే యాకస్మికముగా నాయారోగ్యములో మంచి మార్పు కనబడెను. ఈయారోగ్యాభివృద్ధివలనఁ గొంతయుత్సాహవంతుఁడ నయి నే నీపనికిఁ బూనుట యీశ్వరేచ్ఛ యన్న విశ్వాసము బొందినవాఁడ నయి శక్యాశక్య విచారము చేయక "తలఁచుకొన్నప్పడే తాత పెండ్లి" యన్నట్లా దినముననే పని కుపక్రమించితిని. ఇట్లు జరగుట కడచిన ఫాల్గుణ మాసారoభమున. నా కప్పటి కఱువదితొమ్మిదేండ్లు నిండవచ్చుచుండినవి. ఈపని లో మిత్రులును భాషాభిమానులును నాకు తోడ్పడకమాన రన్నవిశ్వాసముతో నాంధ్రభాషా విషయమునఁ బని చేయుచున్న యైదాఱుగురు మిత్రులకు లేఖలను వ్రాసి మార్చి నెల నడుమను వార్తాపత్రికలలో నొక చిన్నవిన్నపమును బ్రకటించితిని. ఈవిజ్ఞాపనమునకు కొరాపుట్టినుండి భాస్కరరావుగా రొక్కరు మాత్రమే స్వాభిప్రాయము నిచ్చుచు బదులు వ్రాసిరి. నేను లేఖలను వ్రాసినమిత్రులలో నొక రీక్రొత్తకూర్పులో నాంధ్ర భాషావాజ్మయ చరిత్రమునుగూడఁ జేర్పవలసినదని వ్రాసిరి; ఇం కొకరు ప్రబంధములకంటె శతకములే జనసామాన్యములో నెక్కువగా వ్యాపించియుండుట చేత శతకములను జేసిన కవులను గూర్చికూడ నిందొక ప్రకరణమును జేర్చవలసినదని వ్రాసిరి. చేయుట చెప్పినంతసులభము గాక పోవుటచేత "నేనీ డెబ్బదవయేట నీ దేహదౌర్బల్యముతో మిత్రులుకోరినంత చేయఁగలనో లేనో కాని చేతనైనంతవఱకుఁ జేయఁ బ్రయత్నించెదను. వృద్ధత్వదోషముచేత నాయవయవపటుత్వములో విశేష