ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్ర భోజుఁడు
పదునొకండప శతాబ్దిలో ధారానగరము రాజధానిగా మాళవ దేశమును పాలించిన భోజ మహారాజు మహావిద్వాంసుఁడై సంస్కృత భాషావాఙ్మయములను పోషించెను. ఈ యంశమెల్లరకు నెఱుక. ఆ రీతినే యాంధ్రభాషావాఙ్మయములను పోషించిన యొక ప్రభువు 'ఆంధ్రభోజ' బిరుదము నొందెను. అతని నామ మిపుడు మఱుగుపడి బిరుదనామమే నిలిచెను. ఇతఁడు 'నీతిభూషణ' మను రాజనీతి గ్రంధమును రచించినట్లు శ్రీ రామకృష్ణకవిగారు 'సకలనీతిసమ్మత" పీఠికలోఁ దెల్పియున్నారు. ఆ గ్రంథమునందలి కొన్ని పద్యములు "సకలనీతిసమ్మతము" న ఉదాహృతము లైనవి.
'ఆంధ్రభోజుఁడు' భోజునికంటె భిన్నుఁడు. ఇతఁడు భోజునికిఁ దర్వాతను, మడికి సింగనకుఁ బూర్వమున నుండి యుండవలెను. 16 వ శతాబ్దిలో నుండిన లింగమగుంట తిమ్మకవి 'నీతిభూషణము' లోని పద్యములను తన "బాలబోధచ్ఛందము'న నుదాహరించియున్నాఁడు.