Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75

నన్నయభట్టు

రాజనరేంద్రునికరుణ బడసిన యీ కవి యీ పుస్తకమును రాజనరేంద్రున కేల యంకిత మొనర్పలేదో : చాముండికా విలాసము శ్రీరామున కంకితము చేయబడినది . ఇందరి మొదటి పద్యము 'శా - శ్రీవాణీ గిరిజా సమన్వితుల ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ సేవింతున్మది నా త్రిమూర్తులను నా చిత్తంబులో నెప్పుడున్." అని ఇంచుమించుగా నాది పర్వము 'శ్రీవాణీ గిరిజా శ్చిరాయ" యను శ్లోకమునకు భాషాంతరము వలె నున్నది. రెండవ పద్యము నందుకవి 'యిందిరను వాణిని పార్వతిని' తలంచెను. మూఁడవ పద్యమునందు "విఘ్నదేవుఁడు"ను నాల్గవ పద్యము నందు "నాంజనేయుఁడు"ను స్తుతింపబడిరి. పయి సీసపద్య మయిదవది."ఆ జనకసుతావిభు'నకు మొదలుగాఁ గల నాలుగు కంద పద్యములును,( 6, 7, 8, 9 ) రాముని గూర్చిన షష్ట్యంతములు. ఆరంభ పద్యము రామునిఁ బేర్కొనక, తాను నన్నయభట్టు నని చెప్పకొన్న వెంబడినే రాముని గూర్చిన షష్ఠ్యంతములు వేయుట వింతగా గనఁబడుచున్నది. ఈ గ్రంథము నన్నయభట్టకృతము గాదని తలంచుటకు నాకుఁగల కారణములు నిందు క్రింద సంగ్రహము దెలుపుచున్నాను.

(1) నన్నయభట్టుకాలము మొదలుకొని యించుమించుగా తిక్కనకాలము వఱకునుగల కవులు తమగ్రంధమున కాదియం దొక సంస్కృత శ్లోకమును వేసి తరువాత తెలుఁగు పద్యములను వేయుట యాచార మయి యున్నది. నన్నయభట్టాది పర్వము మొదట

"శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే" ............................................

భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే "

అను శ్లోకమును వేసెను. ఆ కాలములోనే యున్న *[1] పావులూరి మల్లన్న తన గణితశాస్త్రమునందు మొదట

  1. (* పావులూరి మల్లన్న 12- వ శతాబ్ది వాడని విమర్శకుల యాశయము. ఆయంశమతని చరిత్రమున వివరింపఁబడును.)