Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

ఆంధ్ర కవుల చరిత్రము

నన్నయభట్ట విరచితమైన "చాముండికావిలాస" మను పద్యకావ్య మొకటి నూతనముగా లభించిన ట్టీనడుమ నాంధ్ర పత్రికయందుఁ బ్రకటింప బడినది. దుర్మతినామ సంవత్సరమునం దనఁగా నిప్పటి కేఁబదియైదు సంవత్సరముల క్రిందట పూర్వపు మాతృకను జూచి దొర్ని పేరయ్య యను నాతనిచే వ్రాయ బడిన పత్రికను దెప్పించి సావధానముగా నే నామూలాగ్రముగాఁ జదివితిని. చదివినకొలఁదిని నాకది నన్నయభట్టకృతము కాదన్న యభిప్రాయము బలపడసాగినది. చాముండిక యనఁగా గౌరీదేవి చాళుక్య వంశజులకు తరములనుండి వచ్చిన కులదైవత మగుటచేతను, గద్యమునందు నన్నయభట్ట విరచిత మని యుండుటచేతను, రాజనరేంద్రుని ప్రీతికయి నన్నయభట్టొకవేళ భారతాంద్రీకరణారంభమునకు ముందు దీనిని రచియించి యుండు నేమో యని యూహింపవలసి యున్నను కవిత్వవిధమునుబట్టి యాలోచింపఁగా నా యూహ కవకాశము కలుగకున్నది. ఈ గ్రంథమును రచించిన కవి వేఱొక నన్నయభట్టనుకొనుటకును వీలులేకుండఁ బ్రధమాశ్వాసారంభమున నున్న యూ క్రింది సీసపద్యము బాధించుచున్నది.


        సీ. వ్యాసాదిఋషులకు వందన మొనరించి
                       కవిమల్లులను జాల ఘనత నెంచి
             సుకవీశ్వరుల నెల్ల సాంపగా వినుతించి
                       గురుపాదయుగ్మము ల్సరవిఁ గొలిచి
             యిష్ట దేవాళి సంతుష్టత సేవించి
                       మంత్రాధిదేవత మది దలంచి
             సర్వజనాళికి సంతోష మొనరించి
                      పార్థివసభల వైభవము గాంచి

             యాంధ్ర వాక్యాను శాసనం బతిశయిల్ల
             జేసి లోకోపకారార్థసిద్ధిఁ చేసి
             ఘనత రాజనరేంద్రునికరుణఁ బడసి
             నట్టివాడను నన్నయభట్ట నేను.