పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్టిగుహలు, కట్టడములు కొన్ని పూర్వశైలమునగూడ నీకాలమున గానవచ్చుచున్నవి. ఈ గుహలను పాడుచేసి, కృష్ణానదికి ఆనకట్టకట్టిన కాలమున, మంచిమంచి ఱాళ్ళు, శాసనములున్న వాటిని, దీసుకొనిపోయి పునాదులక్రింద నదిలో బారవైచిరి. అందులచేత చరిత్రాంశములు చాలవఱకు మనకు లుప్తమైపోయెను. ఈ పూర్వశైల, అపరశైల సంఘారామములను బౌద్ధసన్యాసు లిచ్చట వర్ష కాలములో నివసించుటకై యొక రాజు గట్టించెనట. ఆరాజెవరైయుండునో? యుఆన్‌చ్వాంగ్ గ్రంథముయొక్క మరియొక పాఠమునందు "రాజు కొండను రెండుగా బ్రద్దలగొట్టించి నదిగుండ నొకబాటను వేసెను. ఆకొండను దొలిపించి చక్కని చావళ్ళు మందిరములు వసారాలు విహారములు నిర్మించెను." అని యున్నది. ఈసందర్భమున యాత్రికుడు వ్రాసిన వ్రాతలు సందిగ్ధముగ నుండుటచే నేమియు నర్థముగాకున్నది. కృష్ణానది బెజవాడ కడ సీతానగరము కొండకును, ఇంద్రకీలపర్వతమునకు నడుమగా కనుములోనుండి ప్రవహించుచున్నది. మరియు, నీనది ప్రవహించుటకు కొండ రెండుగా జీల్పబడినట్లుగానబడుచున్నది. పూర్వకాలమున నది, ఉండవల్లి కొండవంటి సీతానగరపు కొండకు దక్షిణవైపున, నా రెండు కొండలకు నడుమగా ప్రవహించినట్లు చిహ్నములు గాన్పించు చున్నవి. ఈకాలమున నది ప్రవహించుతావున పూర్వకాలపు విజయవాడ యుండెనేమో యని సందియముగలుగుచున్నది.