పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్టడములు, మున్నగువాటిలో నేది మన యాత్రికుడు వచించిన శిలాస్తూపమో నిర్ణయింప జాలము. ఈప్రాంతమున అసంఖ్యాకములుగ దేవాలయములు కట్టడములును గలవు. ప్రాచీన వేంగీపురమునకు నాలుగైదు మైళ్ళు దూరమున ఏకాంతమయిన శిఖరముపై నొక సంఘారామము గలదనియు, నచ్చట పెక్కు గుహలున్నవనియు, నందు పూర్వము జిన్న బోధిసత్త్వుడు నివాసముగానుండి హేతువిద్యాశాస్త్రమను తర్కశాస్త్రమును రచించెననియు మనయాత్రికుడు చెప్పియున్నాడు. ఈకాలమున ఏలూరున కుత్తరముగా 20 మైళ్ళుదూరమున కామవరపుకోట చింతగుంటుపల్లియను గ్రామము గలదు. ఇచ్చట సమీపముగా జీలకర్ర గూడెమను పల్లె గలదు. ఈసమీపమున భూగర్భమున పూడ్చుకొని పోయినవి పది పండ్రెండు స్తూపములు గాన్పించు చున్నవి. ఇంకను సమీపమునగల కొండలో నక్క డక్కడ నైదారు గుహలు వరుసగాగలవు. ఇవి పూర్వము బౌద్ధ సన్యాసులు నివసించు గదులని యూహింప వలయును. ఆ సమీపమున శిధిలమయి గన్పట్టు నొకవిశాల సభామంటపమునందు స్థంభము లిప్పటికి గాన్పించుచున్నవి. అదియే పూర్వము విహారమును, చైత్యమంటపము నై యుండెనని యూహింపవచ్చును. ఇక్కడకు సుమారు నూరు గజముల దూరమున నొకకొండ ముఖమున వలయాకారముగ నొకగుహ దొలువబడి గాననగు చున్నది. ఆగుహకు నడుమ నెత్తిమీద గోపురము గలదు.