పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకమునకు బోధింపుము. నివు నేర్చిన న్యాయశాస్త్రమును మాత్రమునేగాక మైత్రేయ బోధిసత్త్వుని యోగాచార్య భూమి శాస్త్రమున బోధింపుము." జినబోధిసత్త్వుడపుడు మంజుశ్రీ బోధిసత్త్వుని యాజ్ఞ శిరసావహించెదననిచెప్పి నమస్కరింప, నా దివ్యపురుషు డంతర్థానమొందెను. పిమ్మట జనుడు చాలకాలము హేతువిద్యాశాస్త్రమును, యోగాచార్యభూమి శాస్త్రమును కడు శ్రద్ధతో నభ్యసించి, తన శిష్యకోటిలో పెక్కుమందికి ఉపదేశించెను. ఆతని శిష్యవర్గములో జాలమంది తమసమకాలీనులలో నంతటివారు యోగశాస్త్రము నభ్యసించిన వారు లేరని ప్రఖ్యాతి గడించిరి.

"ఇచ్చటినుండి చిట్టడవులతో నిండియున్న ప్రదేశము గుండ దక్షిణముగా జనిన ధాన్యకటక (టో-న-స-కి-చీ-కియా.) మును బ్రవేశింతుము"

దక్షిణ కోసలమునుండి మన యాత్రికుడు చాళుక్య రాజ్యమగు వేంగీ దేశమును గూర్చి బోయెను. కృష్ణాగోదావరీ నదుల మధ్యనుండు ప్రదేశము వేంగీదేశమని వ్యవహరింపబడుచుండుట చరిత్రప్రసిద్ధము. ఈ వేంగీనామము రాజధానియగు వేంగీపురమును బట్టి గల్గెను. వేంగీపురము ఏలూరునకు దూర్పుగా నెనిమిదిమైళ్ళ దూరమునకు కొల్లేరునకు వాయువ్యముగా నాలుగుక్రోసుల దూరమున నున్నది. వేంగీపురము క్రీ.శ. పూర్వమనేక శతాబ్దముల క్రితమునుండి ప్రసిద్ధమగు నగరమై యొప్పుచుండెను. ఆంధ్రరాజధానియగు