పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క గుణప్రభావముల గ్రహించి ఆయుర్వేదశాస్త్రము నభివృద్ధి పఱచెను. జ్యోతిష, సిద్ధాంతముహూర్త శాస్త్రములందు పూర్ణమయిన ప్రజ్ఞను సంపాదించెను. రసవాదము నభ్యసించి ప్రజ్ఞావంతు డయ్యెను. మంత్ర తంత్రశాస్త్రము లభ్యసించెను. ఆతడు ఘనవైద్యుడనియు నేత్రచికిత్సయందాతనితో సరిపోల్పదగినవారు ప్రపంచమునందు సయితము లేరను ప్రఖ్యాతి చీనాదేశమువఱకును వ్యాపించెను. నేత్రరోగ చికిత్సలను గూర్చియు, మూలికాదుల ప్రభావముల గూర్చియు, నీతడు రచించిన శాస్త్రములు చీనాభాషలో నున్నవి. బాణుని హర్షచరితమునం దొకచోట పాతాళము నేలు నాగేంద్రుడు "మందాకిని" యను ముత్యాలహారమును మన నాగార్జునుని కొసంగెననియు, నది సర్వవిషసంహారిణి యనియు, దాని స్పర్శచే సర్వజంతుకోటికి సమస్తమగు బాధలు నివారణమగుననియు జెప్పబడెను. బుద్ధుని యుపదేశములందలి హీనాయన మహాయన మార్గములందు, సమానసిద్ధాంతములను నేర్చి యీతడు నూతనధర్మమును ప్రచారము గావించెను. ఈతడు పరమ పురుషార్ధమును బడయుటకు, బౌద్ధులచే విధింపబడిన, చతుర్విధమైన సర్వ శూన్యత్వము, బాహ్యశూన్యత్వము, బాహ్యార్థానుమేయత్వము, బాహ్యార్థప్రత్యక్షత్వము, అను వాదములను బోధించెను. స్వయముగ నీతడు దశభూమికలో ప్రథమ భూమికీశ్వరుడై, యేకో భూమీశ్వరుడని ప్రసిద్ధి వడసెను.