పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యను పద్యకావ్యము కడు సుప్రసిద్ధమైనది. ఈకావ్యము తన పోషకుడగు శాతవాహనుడగు నాగార్జునునిచే ఉదయనునకు వ్రాయబడినదని తారానాధుడు దెల్పుచున్నాడు. ప్రపంచమునం దంతటను, సుహృల్లేఖకు వచ్చిన ప్రసిద్ధి, పూర్వకాలముననైన నేమి, మధ్యకాలమున నైననేమి మరియొక గ్రంథములకు రాలేదట. ఈగ్రంథ మొక పర్యాయము తిబేతు భాషలోనికిని, మూడుమార్లు చీనా భాషలోనికిని భాషాంతరీకరింప బడెనట! చీనా యాత్రికుడగు ఈ చింగ్ భరతవర్షమును సందర్శించి పోయిన కాలమున సుహృల్లేఖ జనులచే ముందుగా నీకాలమున కాళిదాసత్రయమువలె పఠింపబడు చుండెనని వ్రాసియున్నాడు †[1]. సుహృల్లేఖ తరువాత మిగుల ప్రఖ్యాతి గాంచినది "పజ్ఞాపారమిత శాస్త్రము." దీని చీనావారు చంగ్‌లూన్ అని బిలతురు. దీని ననుసరించి నాగార్జునుడు ప్రజ్ఞాప్రదీపశాస్త్రమును రచించెను. ఇది మహాయన శాఖకు జెందిన మాధ్యమిక సంప్రదాయము వారికి ప్రమాణ గ్రంథము. మాధ్యమిక సంప్రదాయము వారనగా, సర్వము శూన్యమని వాదించు బౌద్ధులు. నాగార్జునుడు "దశభూమి విభాగశాస్త్రమను" ఇంకొక గ్రంథమును రచించెను. బోధిసత్త్వుని జీవితమునందు గల దశభూమికలను వివరించి, యందుత్తమమైనదియు భిక్షుక వృత్తిని స్వీకరించి నపుడుగలుగునదియునగు ఆనందావస్థయను ప్రమోదిత భూమికను గూర్చియు,

  1. † Itsing by Takakasu p. 158